Thursday, June 2, 2016

ఈ సం|రం లో వృశ్చిక రాశిలో కుజస్తంభనయోగం మరియు సింహా రాశి లో గురు రాహు గ్రహాల కలయిక , గురుగ్రహం అతిచారం చేత తుల రాశి ప్రవేశం , ఒకే చాంద్రమానం లో గురుగ్రహం 3 రాశులలో (సింహా, కన్య, తుల ) సంచరించడం వలన  ఇంకా ది 02-10-2016 నుండి ది 08-12-2016 వరకు కాలసర్ప యోగం ఉండుట వలన దేశానికి, ప్రపంచానికి అనేక అరిష్ట యోగాలు ఉంటాయి.ప్రపంచం లో యుద్ద వాతావరణం ఉంటుంది, ప్రకృతివైపరీత్యాలు ఉండగలవు. వాహన ప్రమాదాలు, బస్ ,రైలు మరియు వాయు ప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు రాగలవు. పాలక పక్షానికి సమస్యలు, రాజకీయ నేతలు మరియు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టులకు తీవ్ర సమస్యలు మరణాలు రావచ్చును. 

ఈ కాలం నందు ఎవరికి వారు పరిహారాలు చేసినట్లైతే సమస్యలు తగ్గగలవు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి గ్రామం లో గల శివాలయాలో విశేష అభిషేకాలు, రుద్ర మరియు చండీ హోమాలు, ఇంకా చండీ సప్తశతి పారాయణాలు, లలిత సహస్ర పారాయణాలు చేసినట్లైతే సమస్యలు తగ్గగలవు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పూజలు, అభిషేకాలు, నవగ్రహ పూజలు హోమాలు చేసినట్లైతే మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వాలు ఈ విధమైన పరిహారాలు చేయించుట మంచిది.


వృశ్చిక, తుల, ధను, మేష సింహా రాశుల వారు ఈ కాలం లో అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. వీరికి  అనేక విధమైన సమస్యలు రాగలవు. కనుక ఈ రాశులలో జన్మించిన వారు యధా శక్తి శని గ్రహానికి అభిషేకం జరిపించాలి. దుర్గా, సుబ్రహ్మణ్య స్వామి వారలకు విశేష అర్చనలు చేయాలి. ప్రతిరోజూ విష్ణు, లలిత సహస్రనామ స్తోత్రం మరియు చండీ కవచం ఇంకా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి. ఎవరికి వారు రుద్ర మరియు చండీ హోమాలు చేయించుకోవాలి.

సంధ్యవందనం అర్హత ఉన్నవారలు తప్పనిసరిగా సంధ్యావందనాలు ఆచరించాలి. తద్వారా ప్రపంచ శాంతి లభిస్తుంది.

Sunday, January 24, 2016

వాస్తు విజ్ఞానం 12&13
ద్వారాల అమరిక తీసుకోవలసిన జాగ్రత్తలు.
సూర్యదేవర వేణుగోపాల్  M. A ( జ్యోతిష్యం)
పూర్వకాలంలో నిర్మించే గృహాలకు గృహ మధ్యభాగంలో వచ్చే విధంగా దర్వాజాలను అమర్చేవారు. కానీ నేటి కాలంలో  యే నిర్మాణానికైనా మధ్యలో కాకుండా ఉచ్చ స్థానాలలో దర్వాజాలను అమర్చుతున్నారు. ఈ రెండు పద్దతులు సరైనవే. అయితే ఉచ్చ స్థానాలలో దర్వాజాలు ఉంటే మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం. ఏ నిర్మాణానికైనా దర్వాజాలు తప్పనిసరి. యే నిర్మాణానికైనా మంచి స్థానాలలో దర్వాజాలను అమర్చాలి. మంచి స్థానాలలో ఉండే దర్వాజాల వలన మంచి నడక వస్తుంది. మేరుగైన జీవితం ఉంటుంది. చెడు దిశలలో దర్వాజాలను ఉంచినట్లైతే చెడు దిశల గుండా నడక సాగి సమస్యలు వస్తాయి. కనుక దర్వాజాలు అమర్చే సందర్భంలో అనేక జాగ్రత్తలను మనం తీసుకోవాలి.
పాత గృహాలకు దర్వాజాలను ఇంటి మధ్యభాగంలో, గృహ కొలతను సగం చేసి కొంచెం ఉచ్చ స్థానానికి వచ్చే విధంగా దర్వాజాలను అమర్చేవారు. అంటే ప్రధాన దిక్కులందు దర్వాజాలను పెట్టేవారు. దిక్కును 9 భాగాలుగా చేసి, ఈ భాగాలను 9 గ్రహాలకు విభజించి మంచి గ్రహ ఆదిపత్యం లో ఉన్న స్థలంలో సుమారు సెంటర్ నందు దర్వాజ అమర్చే వారు.  పురాతన గృహాలు దాదాపుగా పూరిళ్ళు, నిట్టాడు గృహాలు. ఇటువంటి గృహాలకు గృహ మధ్య భాగంలో దర్వాజా ఉంచితే పై కప్పు బరువును దర్వాజా సమానంగా మోస్తుంది. పై కప్పును సమానంగా మోసే నిమిత్తమై దర్వాజాను మధ్యలో ఉంచేవారు. ఇప్పుడు నిర్మాణ రంగం బాగా వృద్ది చెందింది. అనేక మార్పులు వచ్చాయి. పై కప్పును మోయడానికి పిల్లర్లు,బీమ్ లు ఉన్నాయి. దర్వాజాలను మధ్యలో కాకుండా ఉచ్చ దిశలైన  ఈశాన్యం, పడమర వాయవ్యం, దక్షిణ ఆగ్నేయం లో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి అన్నది నేటి భావన. ఉచ్చ స్థానాలలో దర్వాజాలు ఉంచితే మంచి దిశలగుండా నడక సాగి మెరుగైన జీవితం ఖచ్చితంగా వస్తుంది. కనుక ఉచ్చ దిశలలో ద్వారాలు ఉంచుట మంచిది. ఈ దిశలగుండ నడక సాగినట్లైతే మంచి జీవితం ఉంటుంది అన్నది అనుభవం ద్వారా తెలుసుకొన్న అంశం.
తూర్పు ముఖంగా ఉండే గృహాలకు తూర్పు మరియు తూర్పు ఈశాన్యం నందు దర్వాజాలను ఉంచవచ్చు.  18, 12, లేదా 9 అంగుళాల కట్ట ను ఉంచి తూర్పు ఈశాన్యంలో దర్వాజను అమర్చితే చాలా మంచిది.  ఈ దర్వాజకు ఎదురుగా పశ్చిమ వాయవ్యంలో కూడా దర్వాజాను ఉంచితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక వేళ సెంటర్ దర్వాజాను ఉంచాలనుకొంటే గృహ కొలతను సగం చేసే కొంచెం ఉచ్చ దిశ అయిన ఈశాన్యం నకు జరిపి డోర్ ఉంచాలి. అయితే ఇటువంటి సందర్భం లో ద్వారానికి ఇరు వైపులా కిటికీలు తప్పని సరిగా ఉంచాలి. అదే విధంగా దక్షిణ ముఖంగా నిర్మించే గృహానికి తప్పనిసరిగా దక్షిణ ఆగ్నేయంనందు ద్వారం అమర్చాలి. దక్షిణం సెంటర్ లో దర్వాజను అమర్చడం అంతా మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయంలో దర్వాజాను ఉంచి దానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యం లో ద్వారం అమర్చాలి. ఉత్తరం లో ద్వారం లేకుండా దక్షిణం లో ద్వారం ఉంచకూడదు. పశ్చిమ ముఖ గృహానికి పడమర వాయవ్యం లో దర్వాజ ఉంచాలి. పడమర సెంటర్ లో డోర్ ఉంచకూడదు. పడమర వాయవ్యం లో డోర్ ఉంచి దానికి ఎదురుగా తూర్పు ఈశాన్యం లో డోర్ ఉంచాలి. తూర్పున డోర్ లేకుండా పడమర వైపు డోర్ ఉంచరాదు. ఉత్తర ముఖంగా నిర్మించే గృహానికి ఉత్తర ఈశాన్యం లేదా ఉత్తరం సెంటర్ లో డోర్ ఉంచవచ్చు. ఈ డోర్ కు ఎదురుగా దక్షిణ ఆగ్నేయం లో డోర్ ఉంచుట మంచిది. ఈ డోర్ అమరిక వలన ఆడపిల్లల వివాహాలు త్వరగా తృప్తికరంగా జరుగుతాయి. ఉత్తరం సెంటర్ లో డోర్ ఉంచితే తప్పనిసరిగా డోర్ కు ఇరువైపుల కిటికీలను ఉంచాలి.

ఇంటికి లోపలి భాగం లో గాని వెలుపలి భాగం లో గాని ఇంటికి గాని గదులకు గాని నీచస్థానాలలో ద్వారాలు అమర్చకూడదు. నీచ దిశలైన దక్షిణ నైరుతి,పశ్చిమ నైరుతి, ఉత్తర వాయవ్యం, మరియు తూర్పు ఆగ్నేయం లందు దర్వాజాలు అమర్చకూడదు. ఈ దిశలందు దర్వాజాలు ఉంచి ఈ స్థానాల గుండా నడక సాగడం ప్రమాద హేతువు. అనేక రకాలైన ప్రమాదాలు గృహస్తుకు కలుగుతాయి. కనుక ఉచ్చ స్థానాలైన తూర్పు, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం మరియు పడమర వాయవ్యం నందు డోర్లు అమర్చి ఈ దిశలగుండా నడక సాగితే మనిషి జీవితం అబివృద్దిని పొందుతుంది.
ఈ దర్వాజాలను అమర్చే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహద్వారం ప్రక్కన తప్పనిసరిగా కిటికీ ఉండాలి. కిటికీ లేకుండా సింహద్వారం ఉండ కూడదు. డోర్ కనుక మధ్యలో ఉంటే ఈ డోర్ కు ఇరు వైపులా తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. సింహద్వారం మిగిలిన ద్వారాల కన్నా ఎత్తులో మరియు వెడల్పు లో ఎంతో కొంత పెద్దగా ఉండాలి. సింహా ద్వారాన్ని మించిన కొలతతో లోపలి దర్వాజాలు ఉండకూడదు. దర్వాజాలకు ఎదురుగా దర్వాజా ఉండుట మంచిది. అలా ఉంచలేని పక్షం లో కనీసం కిటికీని  అయినా ఉంచాలి. దర్వాజాలకు ఎదురుగా బోర్ లు బావులు, సెప్టిక్ ట్యాంక్ లు ఉండరాదు. దర్వాజాలకు ఎదురుగా పిల్లర్ కూడా ఉండరాదు. ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
దర్వాజలు కిటికీ లు ఒకే రకమైన కలప తో చేయించుట మంచిది. లేదా 2 రకాలైన కలపతో అయినా ఫరవాలేదు. అంతేకాని 2 రకాలకన్నా ఎక్కువ జాతి తో కలప ఉండకూడదు. వేప కలప వాడినట్లైతే గడప మాత్రం వేరే కలపతో ఉండాలి. గడపకు వేప కలప వాడకూడదు. ఇంటికి వాడే కలప బాగా ఆరుదల కట్టే అయి ఉండాలి. పచ్చి కట్టే వాడ కూడదు. పాత కలప, పుచ్చిపోయిన కలప వాడరాదు. దర్వాజాలను తొర్రలున్న కట్టేతో చేయించరాదు. పిడుగు పడిన గృహ కలపను నూతన గృహానికి వినియోగించరాదు.
దర్వాజాలు అమర్చే సందర్భంలో తప్పనిసరిగా వాస్తు పండితుని సలహా అవసరం.  అన్నీ జాగ్రత్తలు తీసుకొని దర్వాజాలు అమర్చాలి. మంచి దిశకు ఉన్న దర్వాజ మంచి ఫలితాన్ని అందిస్తుంది. దర్వాజాకు ఎదురుగా చెట్లు కానీ నీటిప్రవాహపు పోటు గానీ ఉండరాదు. దర్వాజా సెంటర్ నందు ఆలయాల నీడ లేదా ధ్వజ స్తంభం ఉండకూడదు. ఆలయం ఉండకూడదు. దర్వాజులు వేసేటప్పుడు గాని తీసే తప్పుడు గాని భయంకరమైన ధ్వనులు రాకూడదు. దర్వాజలపై క్రూర మృగాల బొమ్మలు ఉంచరాదు. దర్వాజాలకు ఎదురుగా మెట్లు ఉండకూడదు. మరుగు దొడ్లు దర్వాజాకు ఎదురుగా రాకూడదు. గోడ మూలలు దర్వాజలో ఉండరాదు. ఈ విధంగా దర్వాజా లు అన్నీ జాగ్రత్తలు తీసుకొని అమర్చితే మంచి లాభం కలుగుతుంది.


సూర్యదేవర వేణుగోపాల్   M .A  (జ్యోతిష్యం)   సుందరయ్య నగర్   మధిర    ఖమ్మం జిల్లా

Friday, January 15, 2016

మకర సంక్రాంతి ప్రత్యేకం..........
మకర సంక్రాంతి ఆచారాలు- పరమార్ధం
సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ప్రారంభం అవుతుంది. రవి మకర రాశి ప్రవేశం తో మకర సంక్రాంతి వస్తుంది. ఈ రోజుననే దేవ మార్గం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే వ్రతాలు అనేక శుభఫలాలను అందిస్తాయి. అదే విధంగా ఉత్తరాయణం లో మానవుడు చేసే శుభకార్యాలు ఎక్కువ ఫలాన్ని ప్రసాదిస్తాయి. సూర్యుడు మకరరాశి లో ప్రవేశించే ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నాన,జప,దాన,వ్రతాదులు విశేషాఫలితాలను కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజున విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున చేసే పితృ తర్పణాలు, దానాలు మానవులను పితృ రుణం నుండి తప్పించగలవు.  ప్రజలు అమ్మవారిని పౌష్యలక్ష్మిగా పూజిస్తారు. సంక్రాంతి రోజు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేయకపోతే అనేక రోగాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
రవి సంక్రమణేప్రాప్తే  నస్నాయా ద్యస్తు మానవ:
సప్త జన్మ సు రోగీస్యాత్ నిర్ధన చైవ జాయతే.
మానవులకు పంచవిధమైన రుణాలు ఉంటాయి. దేవరుణం, పితృ రుణం, భూత రుణం, మానవ రుణం మరియు ఋషి రుణం. భూమిపై జీవించే ప్రతి మానవునికి ఈ రుణాలు ఉంటాయి. ఈ రుణాల నుండి విముక్తిని ప్రతి మానవుడు పొందాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ తత్వం అవగతం ఆవుతుంది. ఈ రుణాల నుండి  మనుష్యలకు విముక్తి ని కలిగించడానికి పరిహారాలను ఆచారాల రూపంలో మన పెద్దలు తెలియచేసారు. పెద్దలు చెప్పిన ఈ ఆచారాలను పాటించినట్లైతే  ప్రతి మనిషి తన పంచ విధమైన రుణాలనుండి విముక్తిని పొంది పరమాత్మకు దగ్గర అవుతాడు. పంచ రుణాలనుండి గృహస్తు విముక్తి పొందే మార్గాలను మకర సంక్రాంతి ఆచారాల రూపంలో మన ఋషులు తెలియచేసారు. ఈ విముక్తి తరుణోపాయాలు సంక్రాంతి ఆచారాల రూపంలో నిర్దేశింపబడినవి. కనుక మకర సంక్రాంతి రోజున మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటిస్తే అన్నీ రుణాలనుండి విముక్తిని పొందవచ్చు.
మకర సంక్రాంతి రోజున కొత్తబియ్యం తో పాలు పొంగించి సూర్యాది దేవతలకు మనం నివేదిస్తాం. పులగం, పాయసం చేసి సూర్యాది దేవతలను మకర సంక్రాంతి రోజున పూజించడం చేత  ఈ దేవతల కృపవలన దేవ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందగలం. మకర సంక్రాంతికి పండిన పంట ఇంటికి వస్తుంది. పాడిపంటలకు, వ్యవసాయానికి ఆధారమైన సూర్యభగవానుని తప్పనిసరిగా ఆరాధించాలి. ఆయన ద్వారా వచ్చిన పంటను సూర్యునికే పాలు పొంగళ్ళ రూపంలో నివేదించుట వలన దేవరుణం కొంత మేరకు తొలుగుతుంది.
పితృ తర్పణాలు, పిండోదక దానాల వలన పితృ రుణం తీరుతుంది. మకర సంక్రాంతి రోజున పితృ తర్పణాలు,  దానాలు చేయాలని మన పెద్దలు తెలియజేశారు. ఈ రోజున పితృ పూజను చేసి తర్పణాలు వదలి దానాలు బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా పితృ రుణం నుండి కొంత మేరకు విముక్తిని పొందవచ్చు.
 గాలి, నీరు, ఆకాశం ,భూమి మొ|లైన పంచభూతాల కృప వలన సమస్త జీవరాశికి వ్యవసాయం ద్వారా ఆహారం లభిస్తుంది. కనుక ఈ పంచభూతాలు మానవులకు పూజనీయాలు. సంక్రాంతి రోజున పొలాలలో పొంగలి మెతుకులు చల్లడం, పసుపు కుంకాలు చల్లి గుమ్మడికాయ పగులగొట్టి దిష్టి తీయడం ఆచారంగా మారింది.  పశువులు మానవులకు చేసే మేలుకు గుర్తుగా కనుమ రోజున వీటిని పూజించి కొష్టాలను అలంకరిస్తాము. ఇంకా ముగ్గు లో బియ్యపు పిండిని కలిపి ముగ్గులు వేసి వీటి ద్వారా చీమలు వంటి అల్ప ప్రాణులకు ఆహారం అందిస్తాము. ఇటువంటి ఆచారం పాటిస్తే భూత రుణం నుండి మానవులు  కొంతమేరకు విముక్తిని పొందుతారు.
సంక్రాంతి రోజున దానధర్మాలు చేయమమని మన ధర్మం చెపుతుంది. పండుగ రోజున తిలలు, వస్త్రాలు, ధాన్యం, చెరకు, గోవులు ఫలాలు మొ|లైనవి దానం చేస్తారు. వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తుల వారికి ధాన్యం దానం చేస్తారు.  ఇటువంటి దానాల వలన మనుష్య రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. పురాణ పటనం, జపాతపాలు, బ్రాహ్మణులకు దానాలు వంటివి ఆచరించుట ద్వారా ఋషి రుణం నుండి కొంత మేరకు విముక్తి లభిస్తుంది. ఈ విధంగా మానవులకు ఏర్పడే పంచరుణాలను తొలగించడానికి మన పెద్దలు ఆచారాల రూపంలో తరుణోపాయాలను చూపించారు. వీటిని గురించి తెలిసినా తెలియకపోయినా పండగ ఆచారాలను పాటిస్తే మనుషులకు ఎంతో మేలు జరుగుతుంది.
మకర సంక్రాంతి తో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం లో చేసే ఎటు వంటి పుణ్యకార్యమైన, శుభకార్యమైన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాయణం  గృహారంభాలకు, గృహప్రవేశాలకు చాలమంచి కాలం.దేవతా ప్రతిష్టాలకు ఉత్తరాయణం మంచిది. సౌమ్య దేవత ప్రతిష్టలు తప్పనిసరిగా ఉత్తరాయణం లోనే చేయాలి. నూతన ఆలయాల ప్రారంభం ఉత్తరాయణం లోనే చేయాలి. వివాహాలకు అన్ని శుభకార్యాలకు ఉత్తరాయణం మంచిది.
మకర సంక్రాంతి రోజున ప్రతివారు తప్పనిసరిగా తెలకపిండి ఒంటికి రాసుకొని స్నానం ఆచరించాలి. తెలక పిండికి వాతాన్ని హరించే గుణం ఉంది. శని మకర రాశికి అధిపతి. శని గ్రహం వాతాన్ని పెంచుతుంది. కనుక వాతాన్ని హరించే తెలకపిండి స్నానం ఈ రోజు చాలా మంచిది. ఈ కాలం లో పెరిగే వాతాన్ని అరిసెలు కూడా బాగా తగ్గిస్తాయి. అందుకనే బెల్లం, నువ్వులు, బియ్యపు పిండి తో తప్పనిసరిగా అరిసెలు వండుకు తినాలని మన పెద్దలు చెపుతారు. మన ప్రాంతం లో అందుకనే ప్రతి గృహం లో అరిసలు వండుతారు. సంక్రాంతి రోజు నువ్వులు గుమ్మడికాయ, బెల్లం వంటి వస్తువులు మంచి ఆరోగ్యం కోసం దానం చేయాలి. మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా దానాలు ఇవ్వాలి.
మకర సంక్రమణ పుణ్యకాలేతదానం స్వశక్తి:
ఫలం కాంస్యాది దాన్యాని దీయతే దోషనాశనం
ఫలాని మూలన్యజీనం సువర్ణం గ్రామాంశు కాద్యమ్ సతిలేక్షు గావ:
ధాన్యం ఖరాంశో: మకర ప్రవేశ ఏతానిదానాని వివేషితాని
ఈ శ్లోకం ప్రకారం సంక్రాంతి రోజు ధాన్యం, ఫలాలు, బంగారం,కంచు వంటి లోహాలు దానం ఇవ్వడం మంచిది. ఘృత కంబళి దానం శ్రేష్టం.
సంక్రాంతి రోజు ఏది దాన చేస్తామో అవి అధికంగా జన్మ జన్మలకు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజులో నువ్వులు, బియ్యం కలిపి శివ భగవానుని పూజించాలి. నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. ఆవు నేతితో శివునకి అభిషేకం చేస్తే చాలా మంచిది. నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి. సంక్రాంతి రోజు ఒక్కపూట భోజనం చేయాలి. రాత్రి కాలంలో భుజించరాదు.
యయా సన్నిహితా నాడ్యా: తాస్తా: పుణ్యతమా స్మృతా:
సంక్రాంతి సమీపిస్తున్న కొద్ది అధిక పుణ్య కాలం కాబట్టి  ఈ రోజులో చేసే మంత్ర ధ్యానాలు,జపాలు తపాలు. దానాలు తర్పణాలు శ్రేష్ట మైన ఫలితాలు ఇస్తాయి. చలికాలంలో రాత్రికాలం దీర్ఘంగా ఉంటుంది. పగటికాలం తక్కువుగా ఉంటుంది. కనుక నిద్ర లేచే సమయానికి బాగా ఆకలిగా ఉంటుంది. దీనికి విరుగుడుగా పులగం తినాలని వాగ్భటుడు మొ|లైన వైద్యులు చెప్పడం జరిగింది. రోజు పులగం తినడం ఖర్చుతో కూడిన పని. అందరికీ సాధ్యం కాదు. కనుక ఈ పండుగనాడు అందరికీ అందుబాటులో ఉండటానికి ఆలయ ప్రసాదంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. మకర సంక్రాంతి రోజున శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదవితే మంచి లాభం కలుగుతుంది.మకర సంక్రాంతి ఆచారాల వెనుక అనేక పారమార్ధిక విషయాలు దాగున్నాయి. వీటిని భక్తితో ఆచరిస్తే పరమాత్మ కృప లభించి జీవితం ధన్యం అవుతుంది.


సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

Saturday, January 2, 2016

స్థల ఎంపికలో వాస్తు నియమాలు- ఆంతర్యం
సూర్యదేవర వేణుగోపాల్  M.A (జ్యోతిష్యం)

నిర్మాణానికి స్థలం ముఖ్యంసేకరించిన స్థలం నిర్మాణానికి అనువుగా ఉండాలిస్థలం వాస్తు ప్రకారం ఉంటే నిర్మాణం కూడా దాదాపుగా వాస్తుకు అనుగుణంగానే ఉంటుందికనుక స్థలం తప్పనిసరిగా వాస్తుకు ఉండాలిస్థలం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలిఅన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావునిర్మాణానికి పనికివచ్చే స్థలం లోనే మనం గృహాన్ని నిర్మించాలి. స్థల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు చెపుతుంది. చాలా నియమాలను వాస్తు నిర్దేశించింది. మనిషికి మెరుగైన, ఆరోగ్య ప్రదమైన జీవితం ఇవ్వడమే ఈ వాస్తు నియమాల వెనుక గల ఆంతర్యం. వీటిని మూఢ నమ్మకంగా కొట్టిపారవేయకూడదు. అన్నింటిని పాటించడం నేటి కాలంలో కష్టం. కనుక కొన్ని ముఖ్యమైన, ప్రాధమికమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేని పక్షంలో నష్టాలు కలుగుతాయి. స్థల సేకరణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
స్థలం లో లోపాలు ఉన్నప్పటికి వాటిని వాస్తు ప్రకారం సవరించడానికి వీలుంటే వాటిని తీసుకోవచ్చుసవరించడానికి వీలులేని వాస్తు దోషం ఉన్న స్థలం నిర్మాణానికి పనికిరాదుదక్షిణం, పడమర, మరియు నైరుతి ప్రాంతంలందు సవరించుటకు వీలు లేనంతగా పల్లం ఉంటే అటువంటి స్థలాన్ని తీసుకోకూడదుఈ దిక్కులందు నదులు, నీటి ప్రవాహంలేదా బావులు ఇంకా పూడ్చలేనంత గోతులు ఉంటే ఇటువంటి స్థలం నిర్మాణానికి పనికి రాదుఇటువంటి స్థలాలలో గృహాలను నిర్మిస్తే అనేక ఉపద్రవాలు ఏర్పడతాయితీవ్ర నష్టాలు వస్తాయి. ఈ దిక్కులందు గుంటలు లేదా బావులు ఉంటే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దిక్కులు పల్లం అయితే మానవ మనుగడ కష్టతరం అవుతుంది. చెడును కలిగించే దిశల బలం పెరుగుతుంది. దీనివల్ల మనిషి జీవితం ప్రశాంతంగా ఉండదు. కనుకనే  ఈ వాస్తు నియమాన్ని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ క్రింది శ్లోకం గమనించండి.....
నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    
ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
ధనహానిమ్తధానిత్యంకురుతేనైరుతి ప్లవా                                                                       
పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.
                                      - “ అపరాజితపృచ్చ”
“అపరాజితపృచ్చ” అనే ప్రాచీన వాస్తు గ్రంధం నుండి పై శ్లోకం తీసుకోబడింది. ఈ శ్లోకం ప్రకారం దక్షిణం పల్లం అయితే ధననష్టం, రోగభయం  ఉంటుంది  ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించలేడని తెలుపుతుంది. ఇంకా పశ్చిమం పల్లం అయితే ధన ధాన్య నష్టం, నిత్యం శోకం కలుగుతుందని, నైరుతి పల్లం అయితే మృత్యుభయం, ధననష్టం  మరియు ప్రవర్తనా దోషాలు కలుగుతాయని తెలుపుతుంది. బావులు, నీటిప్రవాహాలు గుంటలు మొ| వాటి వలన భూమి  పల్లం  అవుతుంది. కనుక స్థలానికి దక్షిణం,పశ్చిమం మరియు నైరుతి పల్లం గా ఉన్న స్థలాలను కొనరాదు. ఈ పల్లాన్ని సవరించుకొనే వీలు ఉంటే స్థలాన్ని తీసుకొని వెంటనే మెరక చేయాలి. గృహ నిర్మాణానికి పూర్వమే సవరించాల్సి ఉంటుంది.
ఈశాన్య, తూర్పు మరియు ఉత్తర దిశలందు సవరించడానికి వీలు లేనంత ఎత్తైన కట్టడాలు గాని, పర్వతాలు గాని లేదా రాళ్ళు గాని ఉంటే ఈ స్థలం అంతగా కలసిరాదు.  ఈ స్థలం ధననష్టాన్ని కలిగిస్తుంది. మగవారికి కలసిరాదు.ఈ వాస్తు అమరిక వలన శుభాలను ప్రసాదించే దిక్కులైన తూర్పు,ఉత్తరం, మరియు ఈశాన్యాలు  తమ బలాన్ని కోల్పోతాయి. దీని వలన సుఖప్రదమైన జీవితం లోపిస్తుంది. అందుకొనే ఇటువంటి స్థలాలను కొనేటప్పుడు అధిక జాగ్రత్తను పాటించాలి. అయితే స్థలాన్ని సవరించి శుభ దిక్కులకు బలాన్ని చేకూర్చే వీలుంటే  తీసుకోవచ్చు. వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. నైరుతి, ఉత్తర వాయవ్యం, తూర్పు ఆగ్నేయం నుండి వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. ఈ వీధి శూలలు వలన మృత్యు భయం, ఆర్ధిక నష్టం, ఆరోగ్య నష్టం సంతానం తో సమస్యలు మున్నగు ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ వీధి శూలలు పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించే వీలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వాణిజ్య ప్రాంతం,మెయిన్ రోడ్ లో ఉన్న స్థలానికి ఈ వీధి శూలలు ఉంటే వాస్తు లో చెప్పబడిన పరిహారాలు పాటించి ఇందులో నిర్మాణం చేయవచ్చును. ఏదిఏమైనా వీధి శూలలు ఉన్న స్థలం నిర్మాణానికి మంచిది కాదు. వీధిచూపులున్న స్థలాలు లాభాన్ని కలిగిస్తాయి. తూర్పు,ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, మరియు పశ్చిమ వాయవ్యం నుండి వీధి చూపులుంటే ఇటువంటి స్థలాలను తీసుకోవచ్చు. ప్రవాహ శూల ఉన్న స్థలం కూడా మంచిది కాదు. ప్రవాహ శూల ఏ దిశలోనూ స్థలానికి తగులకూడదు.  ఈ జాగ్రత్త లన్ని గృహస్థుకు సుఖాన్ని కలిగించడానికి చెప్పబడినాయి.
ఆలయ శిఖరం మరియు ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలు మంచివికావు. వీటి నీడ వలన జీవితాలు అభివృద్దికి నోచుకోవు. కనుక ఇటువంటి స్థలాలను తీసుకో రాదు. తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవలసి వచ్చినప్పుడు వీటి నీడ పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించాలి. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో, శివుని ఆలయానికి ఎదురుగా మరియు దేవి ఆలయాలకు పార్శ్వ భాగంలో ఉన్న స్థలాలు మంచివి కావు. ఇటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించి నివశిస్తే అనేక నష్టాలు ఏర్పడి జీవితంలో అభివృద్ది ఉండదు. కాబట్టి ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. కానీ నేటి పరిస్థితులలో ఈ విధంగా వదలివేయుట చాలా కష్టం. కనుక  వీటి ఛాయ పడిన మేరకు స్థలంను వదలి మిగిలిన స్థలంలో గృహం నిర్మించుకోవచ్చును.ఈ క్రింది శ్లోకం పరిశీలించండి..
శివదృష్టి,ర్విష్ణుపృష్టంచ, దుర్గాయా పార్శ్వతో దృశమ్
విఘ్నేశ స్యోర్ద్వ దృష్టించ, తీక్షణ మాహు ర్మనీషీణా
                                                “భృగు మహర్షి “
శివాలయానికి ఎదురుగా ఉండే ఇంటికి శివ దృష్టి వేధ కలుగుతుంది. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో ఉండే గృహానికి విష్ణు వేధ కలుగుతుంది. విఘ్నేశునుకి  ఉర్ద్వ దృష్టి ఉంటుందని భృగు మహర్షి వివరించారు. ఎత్తుగా ఉండే నిర్మాణాలకు సమీపంలో గణేశ్ ఆలయం ఉంటే గణపతి వేధ  కలుగుతుంది. ఆలయప్రహరికి ఇంటికి మధ్య  కనీసం 18 నుండి 20 అడుగుల  వెడల్పుతో రోడ్ తీసి మిగిలిన  స్థలంలో ఇంటిని నిర్మిస్తే దేవతా వేధలు ఉండవు. కనుక ఆలయాల సమీపంలో ఇంటిని నిర్మించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి . ఈ నియమాలన్నీ మానవుని ప్రశాంతతకు కోసం రూపొందించబడినాయి. ఆలయాలకు దగ్గరగా ఉంటే జన సమ్మర్ధం ఎక్కువుగా ఉంటుంది. ప్రశాంతతకు భంగం ఉంటుంది. అందుకనే ఇటువంటి నియమాలు రూపొందించబడినాయి. గృహంలో జరిగే కార్యక్రమం వేరు ఆలయంలో ఉండే కార్యక్రమం వేరు. గృహాలలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల వల్ల ఆలయంలోని దేవునికి, ఇంకా ఆలయం ను సందర్శించే భక్తులకు మైల, ఇతర సమస్యలు రాకుండా వుండడానికే ఆలయాలకు దూరంగా ఉండాలని  వాస్తు చెపుతుంది

స్థలాలు కొనే ముందు స్థలం ఎక్కడ ఉన్నదో జాగ్రత్తగా పరిశీలించాలి. నైసర్గిక వాస్తు చాలా ముఖ్యమైనది. మన స్థలంలో  ఎటువంటి మార్పునైనా చేసుకోగలం. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చలేము. కనుక నైసర్గిక వాస్తును గమనించాలి. పరిశ్రమలు, పెద్ద నిర్మాణాల విషయంలో మరీ జాగ్రత్త అవసరం. ఎందుకంటే స్థలనిర్ణయంలో పొరపాట్లు జరిగితే పరిశ్రమలు దానిపై ఆధారపడి జీవించేవారు తీవ్రంగా నష్టపోతారు. శుభాలను కలిగించే దిశలు బలంగా ఉన్న స్థలాలను ఎంచుకోవాలి. నష్టాలు కలిగించే దిశలు బలహీనంగా ఉండే స్థలంలో ఇటువంటి నిర్మాణం చేయాలి. శుభాలను ప్రసాదించే తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాలు పల్లంగా ఉండి  దక్షిణం,పశ్చిమం ప్రాంతాలు మెరకగా ఉన్న స్థలాలో పరిశ్రమలు నిర్మించాలి. ఇటువంటి స్థలాలకు తూర్పు,ఉత్తరం, ఈశాన్య ప్రాంతాలలో నదులు, నీటి ప్రవాహం ఉంటే బాగా రాణిస్తాయి. పరిశ్రమలు స్థాపించేటప్పుడు దక్షిణ,పశ్చిమ నైరుతి దిక్కులలో ఎత్తైన పర్వతాలు, నిర్మాణాలు ఉన్న స్థలాలను ఎంచుకోవాలి.
శ్మశానాలు ప్రక్కన ఉన్న స్థలం మంచిదికాదు. ఇటువంటి స్థలంలో నివశిస్తే మానసిక ఆందోళనలు, సమస్యలు వస్తాయని వాస్తు ఈ విధంగా నిర్దేశిస్తుంది. ఇంకా నది తో కోత పడిన స్థలం, పిడుగులు పడిన స్థలం, కుళ్లిన జంతు కళేబరాలు ఉంచే స్థలం, ఊడలు దిగిన వృక్షం ఉన్న స్థలం, కొండ యొక్క పాదం దగ్గర ఉండే స్థలం, కొలిమి పెట్టిన స్థలం, గానుగా సున్నం ఆడించిన స్థలం, విపరీతమైన రద్దీ,  జనసమ్మర్ధం ఉండే స్థలం, పుట్టలు,బొరియలతో నిండి ఉన్న స్థలం  మంచివి కావని వాస్తు చెపుతుంది. ఈ ఆదేశాలన్నీ మనిషి రక్షణ కోసం చెప్పబడినవి. కనుక యధాతధంగా కాకపోయిన, వీటిలో కొన్నిటి నైనా పాటించుట మంచిది.కొత్త స్థలం కొనే ముందు వర్గు ను కూడా పాటించితే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రస్తుత పరిస్థితులలో ఇన్ని వాస్తు నియమాలు పాటించడం కష్టం. కనుక ముఖ్యమైన వాస్తు నియమాలలో రాజీ పడకుండా స్థలంను ఎంపిక చేసుకోవచ్చు. కొన్నివాస్తు దోషాలు స్థలంలో ఉన్నాయి అని భావిస్తే అటువంటి స్థలంలో కనుక నిర్మాణం చేయవలసి వస్తే గృహ నిర్మాణానికి ముందే ఆ స్థలాన్ని దున్నించి నవధాన్యాలు వేయాలి. ఇంకా అటువంటి స్థలంలో కనీసం మండలం రోజుల పాటు ఆవులను ఉంచాలి. దోషాలు తొలగిపోతాయి. ఎటువంటి స్థలం అయిన గృహస్తుకు చిత్త శాంతిని ప్రసాదించాలి. అటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించుకోవాలి.  ఈ శ్లోకాన్ని గమనించండి.......
మనస చక్షుషో ర్యత్ర సంతోషో జాయతే భువి
తస్యాం కార్యం గృహం సర్వైరీతి గర్గాది సమ్మతం
                                    “వసిష్ట సంహిత.”
యజమాని మనసుకు, చూపులకు ఏ భూమి సంతోషమును కలిగిస్తుందో ఆ స్థలలంలోనే ఇంటిని నిర్మించాలని గర్గాది మహర్షులు చెప్పారని దీని భావం. ఈ శ్లోకం కూడా గమనించండి...
మనోరమా చ యా భూమి పరిక్షేత ప్రయత్నత:
సర్వేషాం చైవ వర్ణానాం సమభూమి సుభావహా.
                                    “విశ్వకర్మ ప్రకాశిక”
ఏ భూమి యజమానికి మనోహరంగా ఉంటుందో దానిని పరిక్షించి గృహాన్ని నిర్మించాలని, ఎత్తుపల్లాలు లేని శాస్త్ర దూష్యం కానీ స్థలంలో ఇల్లుకట్టాలని దీని భావం. కనుక ఏ స్థలం మనసుకు ప్రశాంతతను ఇస్తుందో అటువంటి స్థలం లోనే గృహనిర్మాణం చేయాలని మన మహర్షులు ఉపదేశించారు.
నేటి కాలంలో స్థలం కొనుక్కునే ఇల్లు కట్టలంటే విపరీతమైన ఖర్చుతో కూడిన పని. అన్ని వాస్తునియమాలు పాటించి స్థలం కోనాలంటే నేటి కాలంలో కొంచెం కష్టం. కనుక ప్రధానమైన వాటిని పాటించి చిన్న చిన్న దోషాలుంటే సవరించి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. వాస్తు నియమాలన్నీ మనిషి కి ప్రశాంతతను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించుట ద్వారా మంచి జీవితం ఉంటుంది.
సూర్యదేవర వేణుగోపాల్

 venusuryadevara@gmail.com 
సూర్యదేవరవేణుగోపాల్. M.A(జ్యోతీష్యం) H.NO-1-879

సుందరయ్య నగర్  మధిర  ఖమ్మం జిల్లా 

Thursday, December 31, 2015

తీవ్ర ఆర్ధిక సమస్యలకు పరిహారాలు



తీవ్ర ఆర్ధిక సమస్యలు మనిషిని క్రుంగదీస్తాయి. సమాజంలో ప్రతిష్ట మసకబారుతుంది. నేటి పోటి ప్రపంచంలోఎక్కువ మంది సరియైన ఉద్యోగం లేకనో, వ్యాపారాలలో తీవ్ర నష్టం వల్లనో లేదా ఇతర మానవ తప్పిదాలవలనో తీవ్ర ఆర్ధిక సమస్యలతో క్రుంగిపోతున్నారు. మానవ జీవితంలో వచ్చే ఇటువంటి ఆర్ధిక సమస్యలకు మన మహర్షులు ఎన్నో తరుణోపాయాలు సూచించారు. వీటిని మూఢ నమ్మకంగా కొట్టివేయకుండా సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్ధిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది.

జాతక పరిశీలన ద్వారా ఆర్ధిక సమస్యలకు పరిహారాలు లభిస్తాయి. జాతకం లో ఏ గ్రహ సంయోగాల ద్వారా ఆర్ధిక సమస్యలు వస్తున్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు శాంతి పరిహారాలు పాటించుట ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. జాతకం కోసం పుట్టిన తేదీ, సమయం మొ|లగు వివరాలు తప్పనిసరి. కానీ ఈ వివరాలు లేనివాళ్ళుఇటువంటి పరిహారాలు పొందలేరు. అందుకని అన్నీ రకాల ప్రజల కోసం కొన్ని పరిహారాలను మన మహర్షులు సూచించారు. జాతకం ఉన్నవారు పుట్టినతేది వివరాలు లేనివాళ్లు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు.

ఆర్ధిక సమస్యలకు పరిహారాలు;

ప్రతి పౌర్ణిమ తిధి రోజు మహాలక్ష్మి ఆలయంలో సహస్రనామార్చన చేయిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది,
ప్రతి మంగళ వారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.
41 రోజుల పాటు శ్రీ లలిత సహస్రనామావళి తో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.
21 రోజుల పాటు వరుసగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ జరిపించాలి.
41 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. అన్ని నియమాలు పాటించాలి.
90 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి రోజు 108 ప్రదక్షిణలు చేసి అర్చన చేయాలి.
శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ మంగళవారం రాహు కాలంలో చేయాలి.
18 మంగళవారాలు లేదా శుక్రవారలందు దుర్గా ఆలయం లో రాహు కాలం దీపం వెలిగించాలి.
41 రోజుల పాటు గణపతిని గరిక తో అర్చించాలి.
11 శ్రావణ నక్షత్రమ్ రోజులందు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలు, పూలతో సహస్ర నామార్చన చేయించాలి.
5 స్వాతి నక్షత్రం రోజులలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికీ సహస్ర నామార్చన జరిపించాలి.
శ్రీలక్ష్మి సహస్రనావళి లేదా శ్రీ లలిత సహస్ర నామావళితో ఒక సం|రమ్ పాటు కుంకుమార్చన చేయాలి. అన్ని నియమాలను పాటించాలి.
ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీసూక్తం పారాయణం చేస్తే ఆర్ధిక సమస్యలు క్రమంగా తగ్గిపోగలవు.
గణపతి ఆలయంలో 41 రోజుల పాటు ప్రతి రోజు 28 ప్రదక్షిణాలు చేసి గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ఈ రోజులలో చవితి తిధి రోజున ఉపవాసం ఉంది గణపతికి ఉండ్రాళ్ళు మరియు ఇతర మధుర ఫలాలను నివేదిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
సర్పసూక్తంతో శివాలయంలో 21 రోజుల పాటు అభిషేకం చేయాలి.
11 సప్తాహాలు శ్రీ గురుచరిత్ర అన్ని నియమాలతో పారాయణం చేసి అనంతరం ఏదైనా దత్త క్షేత్రాలలోతీరిపోగలవు
5 లేదా 11 లేదా 15 లేదా 21 లేదా 25 లేదా 27 సంఖ్యలో బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే ఎటువంటి ధన ఉద్యోగ సమస్యలైన తీరిపోగలవు
గురుముఖంగా లక్ష్మి, లలిత. దత్త విష్ణు శివ మంత్రాలను తీసుకొని ప్రతిరోజూ క్రమం తప్పకుండ జపం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి
సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ సంధ్యా వందనం ఆచరించాలి. సంధ్యావందనం చేయకుండా ఏ దేవతను ఆరాధించిన ప్రయోజనం ఉండదు. సంధ్యావందనం తో సకల అరిష్టాలు తొలగిపోగలవు.
చండీ సప్తశతి పారాయణం ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్ని సమస్యలు తీరిపోగలవు.
7 సప్తాహాలు షిర్డి సాయి చరిత్ర పారాయణం చేసి శిరిడీ ని దర్శించి ధుని లో కొబ్బరికాయను సమర్పించి 11 మంది పేదవారికి అన్నదానం చేస్తే ఆర్ధిక ఆరోగ్య సమస్యలు తీరిపోగలవు.
వాల్మీకి రామాయణం లోని సుందరకాండను ప్రతిరోజూ పారాయణం చేస్తే అన్నీ శుభాలు కలుగుతాయి.

పైన ఉదహరింపబడిన పరిహారాలు ఎవ్వరైన పాటించవచ్చు. పై వాటిలో ఎవరికి అనుకూలమైన పరిహారం వారు చేయవచ్చు. అన్ని పాటించనవసరం లేదు.



సూర్యదేవర వేణుగోపాల్ , H-No- 1-879  సుందరయ్య నగర్
మధిర ఖమ్మం జిల్లా   తెలంగాణ
venusuryadevara@gmail.com


Saturday, December 19, 2015

వాస్తు విజ్ఞానం 6&7
బావి ఈశాన్యంలో, ఉపగృహం నైరుతిలో ఎందుకుండాలి?
                              సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)

దిక్కులను యే విధంగా ఉపయోగించుకోవాలో మనం పరిశీలిద్దాం. అన్ని దిక్కులు ఉపయోగకరమైనవే. ఏ దిక్కుకు ఉండే లాభ నష్టాలు ఆ దిక్కుకు ఉంటాయి. మానవ మనుగడకు దిక్కులను సమతౌల్యం చేసి వినియోగించుకోవాలి. సుఖ శాంతులను ప్రసాదించే దిక్కుల బలాన్ని పెంచి, నష్టాలను ఇచ్చే దిక్కుల బలాన్ని తగ్గించడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మనం గత అధ్యాయాలలో తెలుసుకొన్నాం. దిక్పతుల బలం, నవగ్రహ బలం మనపై ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలను అనుసరించి దిక్కుల బలాబలాలను సమతౌల్యం చేయాలి..దిక్పతుల బలాన్ని యే విధంగా పెంచాలి లేదా తగ్గించాలి అన్నది వాస్తులో చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిజ్ఞానం తప్పనిసరిగా వాస్తు పండితునికి ఉండాలి. ముందుగా దిక్పతి బలాన్ని యే విధంగా పెంచాలో తెలుసుకొందాం. మనకు యే దిక్పతి బలం అవసరమో ఆ దిక్కును బాగా పల్లం చేయాలి. అదే విధంగా విశాలంగా బరువులు వేయకుండా ఉంచాలి. అప్పుడే ఆ దిక్పతి బలం పెరిగి అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అదేవిధంగా ఏ దిక్పతి బలం మనకు నష్టం కలిగిస్తుందో లేదా ఏ దిక్పతి బలహీనంగా ఉంటే లాభిస్తుందో, ఆ దిక్కును బాగా మెరకలో అంటే ఎత్తులో ఉంచి బరువులను వేయాలి. అదే విధంగా ఆ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలాలి. అప్పుడే ఆ దిక్కు బలం తగ్గి మంచి లాభాలను కలిగిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే 
పల్లమైన దిశ అధిబలం కలిగి ఉంటుంది. మెరకలో ఉన్న దిశ బలహీన మౌతుంది.


తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులు శుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. అదే విధంగా దక్షిణ, పశ్చిమ,నైరుతి,వాయవ్య మరియు ఆగ్నేయ దిశలు అశుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. సుఖప్రదమైన జీవితానికి శుభాలను ప్రసాదించే తూర్పు,ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి. అదేవిధంగా అశుభాలను ప్రసాదించే దక్షిణ,పశ్చిమ ,నైరుతి మొదలగు దిశల బలం తగ్గాలి. అప్పుడే దిక్కుల మధ్య సమతౌల్య స్థితి ఉండి మనిషి మనుగడ సుఖప్రదంగా సాగుతుంది. మంచి జీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి కాబట్టి ఈ దిక్కులను పల్లంగాఉంచి బరువులు వేయకుండా విశాలంగా ఎక్కువ ఖాళీగా ఉంచాలని వాస్తు ఆదేశిస్తుంది. అదేవిధంగా మిగిలిన దిక్కులు కష్టాలను నష్టాలను ఇస్తాయి కాబట్టి ఈ దిక్కుల బలం తగ్గాలి కనుక తక్కువ ఖాళీ స్థలం వదలి బరువులు పెట్టి  మెరకలో ఉంచాలని వాస్తు తెలుపుతుంది. ఈ విధంగా చేస్తే 
మనిషి జీవితం సుఖప్రదంగా ఉంటుంది.


పై సూత్రం ప్రాతిపదిక పైనే మనం ఈశాన్యం లో జలాశయాలు, బోర్ వెల్స్ మరియు బావులను త్రవ్వుతున్నాము. బావి, బోర్లు ఈశాన్యంలో ఉండుటవలన అవి బాగా పల్లంగా లోతుగా ఉండటం వల్ల ఈశాన్యం బలం పెరిగి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా తూర్పు ఉత్తరంలలో ఉన్నప్పటికి ఈ దిక్కుల బలం పెరిగి సుఖశాంతులు కలుగుతాయి. ఈ దిక్కుల బలం మానవ మనుగడకు తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈ దిక్కులందే బావులను, జలాశయాలను ఉంచాలని వాస్తు చెపుతుంది. అంతేకాని గ్రుడ్డిగా కారణం లేకుండా వాస్తు చెప్పలేదు. ఈ దిక్కులందు బాగా పల్లం ఉంటే గృహస్తుకు అన్ని విషయాలలో యోగిస్తుంది. అన్నివిధాల అభివృద్ది ఉంటుంది. ఈ క్రింది శ్లోకం గమనించండి......


 పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
సర్వసంపత్కరీ పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
కామదా భోగదా చైవ ధనదాచోత్తర  ప్లవా ---                                                               
వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.                    
ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా----" అపరాజితపృచ్చ"                                              


పై శ్లోకం "అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం లోనిది. తూర్పు పల్లంగా ఉంటే ఆయుషు, ధనం తో పాటు అన్ని శుభాలు కలుగుతాయి, ఉత్తరం పల్లంగా ఉంటే ధనధాన్య వృద్ది ఇంకా వంశ వృద్ది ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యం పల్లంగా ఉంటే సతీ సౌఖ్యం, ధనం, ఐశ్వర్యం సమకూరగలవు అని పై శ్లోకం చెపుతుంది. కనుక సకల శుభాలను కలిగించే ఈ దిక్కులను కావలసినంత మేరకు విశాలంగా పల్లంగా ఉంచితే, ఈ దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న దిక్పతుల,  గ్రహాల ఆశీర్వాదం వల్ల మానవ మనుగడ సుఖప్రదం అవుతుంది. కనుక అత్యంత పల్లం కలిగిన బోర్లు, నూతులు ఇంకా జలాశయాలు ఈ దిక్కులలోనే ఉంచాలి.అప్పుడే ఈ దిక్కులు శక్తివంతంగా మారి శుభాలను ప్రసాదిస్తాయి కాబట్టే మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ దిక్కులను పల్లంగా ఉంచాలని చెపుతున్నాయి. ఈ దిశలందు పల్లం ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని అనుభవంద్వారా కనుగొని మన మహర్షులు తెలియ జేశారు.


అశుభాలను ప్రసాదించే దిక్కుల బలాన్ని సుఖప్రదమైన జీవితం కోసం తగ్గించాలి. కనుక ఈ దిక్కులను మెరక చేసి, బరువులను ఉంచి తక్కువ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ,పశ్చిమ,నైరుతి, ఆగ్నేయ,మరియు వాయవ్య దిశలను మెరక చేసి బరువులను ఉంచడం ద్వారా ఈ దిక్పతులను, గ్రహాలను బలహీనం చేయాలి. అప్పుడే సమస్యలు తగ్గిపోగలవు. ఈ దిశలు పల్లం అయితే ఈ దిక్పతుల బలం పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. మన ప్రాచీన వాస్తు గ్రంధాలు ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. ఈ దిక్పతులను పల్లం చేయడం ద్వారా ఈ దిక్కుల బలాన్ని పెంచితే ఎటువంటి దుష్ట ఫలితాలు కలుగుతాయో " అపరాజితపృచ్చ" అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలిపింది. ఈ శ్లోకం గమనించండి.....
                                 
                                  నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
                             ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    
                             ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
                             ధనహానిమ్ తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.                                                      
                                    పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
                             శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.  
                             ఆగ్నేయ ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
                             శత్రు సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత: 
                             శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ తధా
                             గృహే చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
                                                                             అపరాజితపృచ్చ


పై శ్లోకం ప్రకారం దక్షిణం పల్లమైతే ధననష్టం, రోగభయం. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించడు. నైరుతి పల్లం అయితే సదా రోగ భయం, ప్రవర్తన దోషాలు, ధన హాని ఇంకా మృత్యు భయం. పడమర పల్లం ధన ధాన్యాలను నాశనం చేస్తుంది. ఇంకా ఆగ్నేయ పల్లం వలన అగ్నిభయం, శత్రువృద్ది ఉంటుంది. వాయవ్య పల్లం స్త్రీలకు నష్టం కలిగిస్తుంది. ఇంకా సదా దుఖాన్ని కలిగిస్తుంది. పై శ్లోకం అర్ధం ఇదే.  ఈ దిశలందు పల్లం అయితే ఈ దిక్కుల బలం పెరిగి మానవునికి తీవ్ర నష్టాలు వస్తాయి. కనుక వీటిని మెరకలో ఉంచి తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లుగా చేసి బరువులు వేయడం ద్వారా వీటి బలాన్ని తగ్గిస్తే మనిషి జీవితం బాగుంటుంది. అత్యంత పల్లం ఉండే బావులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులలో ఉంచితే వీటి బలం విపరీతంగా పెరిగి తీవ్ర నష్టాలు వస్తాయి. అందువల్లే ఈ దిక్కులందు నూతులు, బోర్లు, జలాశయాలు ఉండరాదని వాస్తు తెలియజేస్తుంది.ఈ దిక్కుయందు ఉపగృహాలు నిర్మిస్తే ఈ దిక్కుల బలం తగ్గి సమస్యలు తగ్గుతాయి. అయితే బావులు పడమర వాయవ్యంలో ఉండటం పాత ఇండ్లలో మనం నేటికీ చూస్తాము. ఈ దిక్కు చంద్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి బావులు ఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికి ఈ దిక్కు లో బావులు ఉండుట వలన ఆర్ధిక అభివృద్ది లోపిస్తుంది. స్త్రీలకు ఇంకా పురుషలకు కూడా ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు. ఈ దిశ పల్లం అయితే వాయు మరియు చంద్రుని బలం పెరిగుతుంది. ఈ బలం వ్యవసాయానికి మరియు పశువుల అభివృద్దికి తోడ్పడుతుంది. పూర్వకాలంలో మానవుని ప్రధానమైన ఆర్ధిక వనరు ఇవే కాబట్టి వారికి లాభించి ఉండవచ్చు. అయితే నేటి కాలంలో ఇది లాభించదు. కాబట్టి ఇక్కడ బావులు ఉండకూడదు. కనుక నష్టాలను లేదా అశుభాలను కలిగించే దిక్కులను బలహీనపర్చుట ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు. ఈ దిక్కులు కూడా మంచివే. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో వీటి బలం కూడా మనిషికి అవసరం అవుతుంది. కనుక వీటిని జాగ్రత్తగా కావలసినంత మేరకే వినియోగించుకొంటే సర్వోతోముఖాభివృద్ది ప్రాప్తిస్తుంది.


మానవుని సుఖజీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు, ఉత్తర,ఈశాన్య దిక్కులకు బలం పెంచడానికే అత్యంత లోతుగా, పల్లంగా ఉండే నూతులు, బోర్లు, జలాశయాలు ఈ దిక్కులందు ఉండాలని వాస్తు ఆదేశిస్తుంది. అశుభాలను, నష్టాలను కలిగించే దక్షిణ,పశ్చిమ, నైరుతి,ఆగ్నేయ మరియు వాయవ్య దిశల బలం తగ్గించడం కోసం ఈ దిక్కులందు బావులను బోర్లను ఉంచకుండా, మెరకజేసి బరువులను ఇంకా ఉపగృహాలను నిర్మించమని వాస్తు తెలియజేస్తుంది. ప్రకృతి నుండి లాభాలను పొందడానికే వాస్తు ఈ విధమైన సూత్రాలను అందించింది. అంతే కాని వాస్తు సూత్రాలు మూఢంగా కారణం లేకుండా రూపొందించబడినవి కావు. ఇందులో ఎంతో విజ్ఞానం ఇమిడివుంది. ఈ సూత్రాలన్నీ మానవ శ్రేయస్సుకోసం ఉద్దేశింపబడినవే.
                                                         
   సూర్యదేవర వేణుగోపాల్


సూర్యదేవర వేణుగోపాల్. M.A(జ్యోతీష్యం), H.NO-1-879,సుందరయ్య నగర్
  మధిర,  ఖమ్మం జిల్లా తెలంగాణ