Sunday, November 29, 2015

వాస్తు విజ్ఞానం-2&3
అన్ని చింతలకు ఈశాన్యమే పరిష్కారం కాదు.
                                                సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)

ఈశాన్యం పెంచడం నవీన వాస్తు లో ఒక విపరీత ధోరణిగా మారింది. అన్ని సమస్యలకు ఈశాన్యం తూర్పు ఉత్తర నడకలే పరిష్కారంగా ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికైనా,ఏ నిర్మాణానికైనా అయిన ఈ దిశలు మాత్రమే కరెక్ట్ గా ఉంటే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయన్న ఒక విపరీత ధోరణి ప్రచారంలో ఉంది.ఈశాన్యం పెంచి తూర్పు ఉత్తర దిశలను కరెక్ట్ గా ఉంచి ఈ దిశలగుండ నడకలను ఏర్పర్చడంతో వాస్తు కు సంపూర్ణత్వం వస్తుంది అని నేటి భావన. కాని ఇది కరెక్ట్ కాదు.అన్ని దిశలు మంచివే. ఏ దిశకు ఉండే లాభ నష్టాలు ఆ దిశకు ఉంటాయి. అన్ని దిశలను సమతౌల్యం చేసి నిర్మించిన నిర్మాణాలే బాగా రాణిస్తాయి. ఏ దిక్కును యే విధంగా,ఏ మేరకు ఉపయోగించాలి అన్నదే ముఖ్యమైన విషయం. అందులోనే వాస్తు ప్రతిభ దాగుంది. అన్ని నిర్మాణాలకు ఒకే విధమైన వాస్తు సరిపడదు.. వృత్తిని బట్టి, కార్యకలాపాలను బట్టి,ప్రయోజనాన్ని బట్టి వాస్తును ఇవ్వవలసి ఉంటుంది. ఒక వ్యాపారానికి వాస్తు ఇచ్చే సందర్భంలో చాలా  విషయలను పరిగణనలోకి తీసుకోవాలి.ఇవ్వబడే  వాస్తు అక్కడ జరిగే వ్యాపారానికి సహకరించాలి. వ్యాపార అభివృద్దికి తోడ్పడాలి. ఒక విద్యా సంస్థకు ఇచ్చే వాస్తు సంస్థ అభివృద్దితోపాటు విద్యానాణ్యత కూడా పెరిగేలా  ఉండాలి.గృహ నికి ఇచ్చే వాస్తు పరిశ్రమలకు,వ్యాపారాలకు ఇచ్చే వాస్తు ఒకేలా ఉండదు. అదేవిధంగా గృహ వాస్తును దేవాలయాలకు అన్వయించకూడదు. అన్నిటికి ఒకే విధమైన వాస్తు సూత్రాలు అంతగా లాభాన్ని కలిగించవు. ప్రస్తుతం మనం గమనిస్తే అన్నిటికి  అంటే గృహాలకు, వ్యాపారాలకు, ధార్మిక సంస్థలకు ,విద్యాలయాలకు మొ| అన్నిటికి ఒకే విధమైన వాస్తు సూత్రాలను పాటిస్తున్నారు. దీని వల్ల నష్టం అంతగా ఉండనప్పటికి అభివృద్ది మాత్రం త్వరితగతిన జరుగదు. కనుక  దిక్కులను, దిక్పతులను మరియు నవగ్రహాలను బాగా అర్ధం చేసుకొని వాస్తును పాటించవలసి ఉంటుంది.వాస్తులో లోతైన అవగాహనకు  వాస్తు తో పాటుగా జ్యోతిష్య పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం. ఒకటి లేదా రెండు వాస్తుపుస్తకాల జ్ఞానం చాలదు. మన పూర్వ గ్రంధాల వాస్తు పరిజ్ఞానం తోపాటు జ్యోతిష్య పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి..
ఆధీతో గణితో యస్తు వాస్తుకేషు కృతశ్రమ:
శోధికారీ భవేరత్ర వాస్తుశాస్ర విరీక్షిత:
గణితము మరియు లోతైన శాస్రజ్ఞానం కలిగినవారు మాత్రమే వాస్తుపండితులు కాగలరని స్థూలంగా దీని భావం.
మనం నిర్మించే కట్టడాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అన్ని కట్టడాలలో ఒకే విధమైన కార్యకలాపాలు ఉండవు. గృహ ప్రయోజనం వేరు, వ్యాపార ప్రయోజనం వేరు అదే విధంగా పరిశ్రమలలో జరిగే కార్యకలాపాలు వేరు, హస్పిటల్స్ లో జరిగే కార్యకలాపాలు వేరు. విశ్రాంతి మందిరాల ప్రయోజనం వేరు అదే విధంగా సినిమా హాల్ ప్రయోజనం వేరు. ఈ ప్రయోజనాలను అనుసరించి వాస్తు నిర్ధారణ ఉండాలి. దిక్పతుల బలాబలాలు పూర్తిగా అవగాహన చేసుకొని,యే ప్రయోజనానికి యే దిక్పతి బాగా సహకరిస్తాడో తెలుసుకొని వాస్తును నిర్ధారించవలసి ఉంటుంది. ఈ విధమైన వాస్తు వలన అభివృద్ది సాధ్యం అవుతుంది. ఉదా: ఆసుపత్రుల ముఖ్య లక్ష్యం వైద్యం. మరణాల సంఖ్య తగ్గాలి కనుక వైద్యం మెరుగుగా బలంగా ఉండాలి. కనుక ఏ దిక్పతి ఈ ప్రయోజనాన్ని అధికంగా నెరవేర్చగలడో తెలుసుకొని ఆ దిక్పతి బలాన్ని పెంచే విధంగా వాస్తును అమలుపర్చాలి. అదే విధంగా విద్యాలయంలో విద్యా అభివృద్ది కోసం వాస్తు సహకరించాలి. కనుక విద్యాభివృద్దికి తోడ్పడే దిక్పతికి బలాన్ని కలిగించే విధంగా వాస్తు ఉండాలి. అంతేకాని అన్నిటికి తూర్పు ఉత్తరాలవైపు, పడమర దక్షిణాల కన్నా అధికమైన ఖాళీ ఉంచి ఈశాన్యాన్ని బాగా పెంచి నడకలను ఆ దిశలందు ఏర్పాటు చేస్తే సరిపోదు. ఈ దిశలే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. అన్ని నిర్మాణాలకు ఈ విధమైనవాస్తు అమరిక అమృతం కాదు. ఒక నిర్మాణానికి ఈశాన్య దిక్పతి బలం అవసరమౌతుంది,మరొక నిర్మాణానికి పడమర దిక్పతి సహాయం కావలసివస్తుంది, ఇంకా కొన్ని నిర్మాణాలకు దక్షిణ పశ్చిమ దిక్పాలకులు బలంగా ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రయోజనాన్ని బట్టి దిక్కులను దిక్పాలకులను వినియోగించుకోవాలి. ఇదే సరియైన పద్దతి.
 ఈ విధానమే మంచి లాభాలను కలిగిస్తుంది. కనుక దిక్కులను యే ప్రయోజనాలకు ఎంత మేరకుఉపయోగించాలో వాస్తు పండితుడికి తప్పనిసరిగా తెలిసిఉండాలి. ప్రయోజనాన్ని బట్టి కార్యకలాపాలను బట్టి వాస్తు మారుతుంది. అన్నిటికి ఈశాన్య జపమే కరెక్ట్ కాదు.
ఈశాన్యం గురించి మనకు కొన్ని మూఢ నమ్మకాలున్నాయి. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అని నేటి నమ్మకం. చాలా మంది వాస్తు పండితులు కూడా ఈ నమ్మకాన్నే బలపరుస్తున్నారు. కాని నిజం ఏమంటే  ఈశాన్యం పెరగాలే కానీ మరీ విపరీతంగా పెరగకూడదు. ఈశాన్యం విపరీతంగా పెరగడం వల్ల అధిక ఖర్చు, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపించడం వంటి సమస్యలు ఉంటాయి. ఈశాన్యం విపరీతం గా పెరిగితే స్థల ఆకారం లో మార్పువస్తుంది. ఆ స్థలం “విషమబాహు స్థలంగా” మారుతుంది. విషమే శోకలక్షణం” అని చెపుతుంది “సమరాంగణ సూత్రధార” అనే ప్రాచీన వాస్తుగ్రంధం. కనుక స్థల ఆకారంలో మార్పు వచ్చే విధం గా ఈశాన్యం కూడా పెంచకూడదు. అసలు ఈశాన్యం ఎంత పెంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.
                                “మాషామాత్రంతు ఈశాన్యం పుత్రదారాది లాభకృత్
                                విద్యావినోద పాండిత్యం చతుస్పాజీవ లాభదం”
                                                                                                                “ప్రాచీనకారిక”
మినపగింజంత పరిమాణంలో ఈశాన్యం పెరిగినా భార్య, సంతాన లాభముతోపాటు విద్య,పాండిత్యం,పశుగణ వృద్ది కలుగుతాయి అని ప్రాచీనకారిక అనే ప్రాచీన వాస్తు గ్రంధం తెలియ జేస్తుంది. దీని ప్రకారం మనం గమనిస్తే ఈశాన్యాన్ని విపరీతంగా పెంచాల్సిన అవసరం లేదు అని స్పష్టమౌతుంది. తూర్పు ఆగ్నేయం కన్నా మరియు ఉత్తర వాయవ్యం కన్నా కొద్దిగా పెరిగితే సరిపోతుంది. కరెక్ట్ చెప్పాలంటే స్థలం యొక్క వైశాల్యంను అనుసరించి ఈశాన్యాన్ని పెంచడం మంచిది.
ఇప్పుడు మనం ప్రయోజనాలను అనుసరించి, కార్యకలాపాలను లేదా లక్ష్యాలను అనుసరించి వాస్తును యే విధంగా మలచాలో, దిక్పతుల బలాన్ని యే విధంగా ఉపయోగించుకోవాలోతెలుసుకుందాం. ఉదాహరణకు కొన్ని సంస్థలను పరిశీలిద్దాం. ముందుగా హాస్పిటల్స్ కు యే విధమైన వాస్తు అవసరం అవుతుందో పరిశీలిద్దాం. వైద్య శాలలు అందరికీ సమానమే. స్త్రీ పురుషులిరువురు సమానమైన వైద్యాన్నిపొందుతారు. మరణాల సంఖ్య తగ్గాలి మెరుగైన వైద్యం ప్రజలందరికీ అందాలి. అదే విధంగా వైద్యుడు అభివృద్దిని పొందాలి. హాస్పిటల్ యొక్క ప్రయోజనం ఇదే. ఈ ప్రయోజనాలకి ఏ దిక్కులు సహకరిస్తాయో ఏ దిక్కులు ఆటంకాలను కలిగిస్తాయో ముందుగా తెలుసుకోవాలి. హాస్పిటల్స్ కు తూర్పు మరియు పడమర దిశల ఖాళీ ప్రదేశాలలో ఎక్కువ బేధం ఉండరాదు. పడమర కన్నా తూర్పు కొద్దిగా మాత్రమే ఎక్కువ ఉండాలి.పడమర వైపు ఖాళిస్థలం లేకుండా హాస్పిటల్ నిర్మించరాదు. అదేవిధంగా ఎత్తుపల్లాలలో కూడా తూర్పు పడమరల మధ్య అధిక బేధం ఉండకూడదు. పడమర తూర్పుకన్న కొద్దిగా మాత్రమే ఎత్తు ఉండాలి.హాస్పిటల్స్ కు దక్షిణం వైపు ఖాళీ ఉండాలి. నైరుతి, ఆగ్నేయ,దక్షిణ ప్రాంతాలు ఈశాన్య, వాయవ్య, పడమర, తూర్పు దిశల కన్నా ఎత్తు ఉండాలి. ఆపరేషన్ గదులు పడమర, వాయవ్య, తూర్పు, ఆగ్నేయ దిశలలో ఉండాలి. దక్షిణం మధ్య భాగంలో మరియు నైరుతి దిక్కులో  ఆపరేషన్ రూమ్ ఉండకూడదు.ఉత్తర దిశ, ఈశాన్య దిశ పల్లంగా ఉండాలి. ఉపయోగించిన నీరు ఈ దిశలగుండ బయటకు వెళ్ళాలి. హాస్పటల్ యజమాని యైన డాక్టర్ తన వర్గు నియమాన్ని అనుసరించి తన గదిని నిర్మించుకోవాలి. తన స్వ వర్గులో కానీ, మిత్ర వర్గు కలిగిన దిశలలో కూర్చోవాలి. అంతే కాని యజమాని దిక్కు నైరుతి మాత్రమే అని ఆ దిశలో కూర్చోరాదు. నైరుతి దిశ డాక్టర్ యొక్క శత్రు దిశ అయితే చాలా సమస్యలు వస్తాయి.హాస్పటల్స్ కు తూర్పు బలం చాలా అవసరం కనుక తూర్పులోనే Underground Watersumps నిర్మించాలి. Pharmacy వాయవ్యంలో మంచిది. Cash counter ఉత్తరంలో ఉండాలి. Store room నైరుతి లో ఉండాలి. వైద్యశాలలకు తూర్పు,పడమర మరియు ఉత్తరం సింహద్వారములు మంచివి. ఈ విధంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ధారించాలి.తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి.
అదే విధంగా విద్యాలయాల వాస్తును గమనిస్తే, విద్యార్ధులు తూర్పు లేదా ఉత్తరం అభిముఖంగా కూర్చొని విద్యను నేర్చుకోవాలి. దీనికి అనుగుణంగా తరగతి గదులను రూపొందించాలి. ఉత్తరం పల్లంగా ఉండాలి. నిర్మాణం చుట్టూ 4 దిశలందు ఖాళీ ఉండాలి. తూర్పుఉత్తరాల వైపు విపరీతమైన ఖాళీ ఉంచి భవనాన్ని నిర్మించరాదు. ఈ విధంగా చేయడం వల్ల భవనం మొత్తం పూర్తి నైరుతిలోకి ఉంటుంది లేదా స్థలం యొక్క అసుర భాగంలోఉంటుంది. ఈ విధంగా ఉంటే విద్యాఫలితాలు ఆశించినంతగా ఉండవు. కనుక అసుర స్థానంలోకి భవనం వెళ్లకుండా జాగ్రత్తగా నిర్మించాలి. ఉత్తరం లేదా  తూర్పు భాగాలలో కాష్ కౌంటర్ ఉండాలి. వాయవ్యంలో విద్యాసంస్థలకు కాష్ కౌంటర్ మంచిది కాదు. అన్ని దిశలకన్నా ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యం పల్లంగా ఉండాలి. పరిశోధన శాలలు తూర్పు, పడమర వాయవ్యం మరియు ఆగ్నేయం లో ఉండాలి. పి‌హెచ్‌డి తరగతులు తప్పనిసరిగా ఉత్తరం లో ఉంచాలి. సైన్స్ తరగతులను పడమర దక్షిణ దిక్కులందు మిగిలినవి వాయవ్య ఉత్తర దిశలందు ఏర్పాటుచేయాలి. విద్యాలయాలకు దక్షిణ.పడమర తూర్పు సింహా ద్వారములు మంచివి. మగపిల్లల తరగతి గదులు దక్షిణ  తూర్పులందు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్త్రీలకు పడమర ఉత్తరాలు మంచివి. విద్యాలయాలకు తప్పనిసరిగా ప్రధాన దిశలందు గేట్ తప్పనిసరి.ఈశాన్యంలో గేట్ ఉన్నది కదా అని ప్రధాన దిశాలైన తూర్పు,ఉత్తరాలలో గేట్ లేకుండా ఉండకూడదు. ఈ విధంగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వాస్తును నిర్ణయించాలి. తూర్పు ఈశాన్యం  కన్నా ఉత్తర ఈశాన్యం కొద్దిగా ఎక్కువ ఉండాలి.
ధార్మిక సంస్థలకు, ఆశ్రమాలకు నైరుతి దోషం ఉండకూడదు. నైరుతి దోషం ఉంటే ఆశ్రమాలు అక్రమాలకు నిలయం కాగలవు. అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఉండరాదు. కలహాలు ఉంటాయి. ఆశ్రమాలకు నైరుతి మరియు ఆగ్నేయ దోషం ఉంటే అనేకరకమైన ప్రవర్తనా దోషాలు ఉంటాయి. ఈ దోషానికి వాయవ్య దోషం తోడైతే పోలీస్ కేసులు ఇంకా న్యాయపరమైన వివాదాలు ఉంటాయి.  అదేవిధంగా వీటిని తప్పనిసరిగా 4 వైపులా సమానమైన ఖాళీ వదలి నిర్మించాలి. ఆశ్రమాలకు లాభాపేక్ష ఉండదు కాబట్టి  వీటికి ఈశాన్యం పెంచరాదు. 4 దిశలు సమంగా ఉండాలి.ఇది గమనించండి
                “ముక్తికామస్యకరణే శుద్ద ప్రాచీమ్ ప్రయోజయేత్”
ముక్తిని కొరువారు 4 కొలతలు సమానమైన భూమిలో నివశించాలి. దీనినే శుద్ధ ప్రాచీ స్థలం అని అంటారు. ఈ స్థలంలో ఈశాన్యం పెరిగి ఉండక 4 దిశలు సమానం గా ఉంటాయి. ఇటువంటి స్థలాలలో ఆశ్రమాలు ధార్మిక సంస్థలు బాగా రాణిస్తాయి.సింహద్వారాలు ఈశాన్య భాగంలో కాకుండా ప్రధాన దిక్కులలో ఉండాలి. తూర్పు,పడమర ,ఉత్తరం మరియు దక్షిణ మధ్య భాగాలందు ద్వారాలు ఉండాలి. అంతే కాని విదిక్కు లైన ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం ,పశ్చిమ వాయవ్యం లలో సింహద్వారాలు ఉండకూడదు. విదిక్కులందు కిటికీలను ఉంచాలి.
వ్యవసాయానికి పడమర మరియు వాయవ్య దిశలు బలంగా ఉండాలి. వ్యాపారానికి ఉత్తరంతో పాటు దక్షిణ ఆగ్నేయం కూడా బాగుండాలి.కొన్ని రకాలైన వ్యాపారాలకు ఉత్తరం కన్నా దక్షిణం కొద్దిగా పల్లంగా  ఉండాలి.బార్ మరియు మద్యపాన దుకాణాలకు నైరుతి బలంగా ఉండాలి. మద్యపాన దుకాణాలకు ఈశాన్యం కన్నా నైరుతి ఎంతోకొంత పెరిగిఉంటే చక్కటి వ్యాపారం ఉంటుంది. అయితే ఇటు వంటి షాపుల యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండి ఈశాన్యం పెరిగి ఉండాలి.ఇటు వంటి విచారణ తో మరియు పూర్తి అవగాహనతో వాస్తును అమలు చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. గృహాలలో తప్పనిసరిగా దక్షిణం పడమరలు తూర్పు ఉత్తరాలకన్నా మెరకగా ఉండాలి నైరుతి అన్నిటికన్నా మెరక తో మరియు ఈశాన్యం అన్నిటికన్నా పల్లంగా ఉండాలి.
ఈ విధంగా పూర్తి అవగాహనతో వాస్తును అనుసరించవలసి ఉంటుంది. మిడిమిడి జ్ఞానం పనికి రాదు. దిక్పతులను దిక్కుల లక్షణాలను మరియు నవగ్రహాలను పూర్తిగా అవగాహన చేసుకొని వాస్తును అమలుచేయాలి. ఈశాన్యం పెంపుతో తూర్పు ఉత్తర నడకలతో వాస్తు ఆగిపోదు.ఇది నిరంతర ప్రక్రియ పరిశోధన చేస్తే ఎన్నో విషయాలు వెలుగులోనికి వస్తాయి.
గృహాలకు వాస్తును నిర్ణయించేటప్పుడు చెడును కలిగించే దిక్పతుల బలాన్ని తగ్గించి మంచిని కలిగించే దిశల బలాన్ని పెంచేటట్లుగా అమరిక ఉండాలి. కాని కొన్ని రకాలైన నిర్మాణాలకు చెడును కలిగించే దిశలను కూడా అవసరమైనంత మేరకు ఉపయోగించుకోవలసి ఉంటుంది. అప్పుడే నిర్మాణం యొక్క ప్రయోజనం చక్కగా నెరవేరగలదు. ఉదాహరణకు మద్యపాన దుకాణాలకు నైరుతిని కొంచం పెంచవలసి ఉంటుంది. నైరుతి దురలవాట్లను పెంచుతుంది. మద్యం ఒక దురలవాటు. కనుక మద్యం దుకాణాలు నిర్మించేటప్పుడు నైరుతిని ఆగ్నేయ వాయవ్యాల కన్నా కొంచెం ఎక్కువ ఉంచితే మద్యం అమ్మకం పెరుగుతుంది. కాని ఈ మద్యం దుకాణం యజమాని ఇంట్లో నైరుతి కరెక్ట్ గా ఉండాలి ఎంతోకొంత ఈశాన్యం పెరిగిఉండాలి. ఈ సందర్భంలో మనం చెడును ప్రసాదించే నైరుతిని అవసరమైనంతగా ఉపయోగించగలిగితే ఇటువంటి వ్యాపారాలు బాగా వృద్దిలోకి వస్తాయి. ఈ విధంగా జరిగే కార్యకలాపం,ప్రయోజనం బట్టి వాస్తు అమరిక ఉండడం సరియైన పద్దతి. అదేవిధంగా హోటల్స్ కు ఉత్తరం దక్షిణం సమానమైన ఎత్తులో ఉండాలి. కొన్ని రకాలైన హోటల్స్ కు దక్షిణ దిశను ఉత్తర దిశ కన్నా కొద్దిగా పల్లంగా ఉంచితే వ్యాపారం బాగా సాగుతుంది. దక్షిణం పల్లమైతే వ్యయం. కాబట్టి తినుబండారాలు అమ్మకం జోరుగా సాగుతుంది. కాని యజమాని ఇంట్లో మాత్రం ఉత్తరమే పల్లంగా ఉంచాలి. దక్షిణ దిశను మెరకలో ఉంచాలి. ఇటు వంటి వాస్తు నిర్ణయాలు తీసుకొనే సందర్బంలో సరియైన వాస్తు పండితుని సలహా మరియు పర్యవేక్షణ అవసరం. కిరాణా దుకాణాలు,ఆర్ధికపరమైన సంస్థలను  దక్షిణ ముఖద్వారం తో నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.దక్షిణ ఆగ్నేయంలో దర్వాజా ఉంచితే స్త్రీలకు సకాలంలో వివాహాలు అవుతాయి.పాడిపరిశ్రమలకు, పశువుల కొష్టాలకు తూర్పు కన్నా పడమరను పల్లంలో ఉంచాలి. అప్పుడే పశువృద్ది, పాలవృద్దిచక్కగా ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుంటుంది.

దీనిని బట్టి అర్థం అయ్యే దేమంటే అన్నీ దిశలను  వాటి లక్షణాలను అనుసరించి మనం సరిగ్గా ఉపయోగించుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. దిక్పతుల బలాబలాలను సరిగ్గా అంచనా వేయడంలోనే నిజమైన ప్రతిభ దాగుంది. ఇటు వంటి ప్రతిభ ఉన్నవారే నిజమైన వాస్తు పండితులు. వీరివల్ల ప్రజలకు సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

No comments:

Post a Comment