తూర్పు ఉత్తరాలలో
ఎక్కువ ఖాళీ ఎందుకు వదలాలి?
సూర్యదేవర
వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
అన్ని దిక్కులు ఒకే విధమైన ఫలితాలు ఇవ్వవు. ఒక్కొక్క
దిక్కుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గృహాన్ని నిర్మించే సందర్భంలో
మంచిని కలిగించే దిక్కుల బలాన్ని పెంచి చెడును కలిగించే దిక్కుల ప్రభావంను తగ్గించుట
ద్వారా సుఖజీవితాన్ని పొందవచ్చు. కాని ఈ సందర్భంలో కొన్ని దిక్కులు
మంచిని ఎందుకు ప్రసాదిస్తున్నాయి మరికొన్ని దిక్కులు చెడును మాత్రమే ఎందుకు ఇస్తాయి
అన్న ప్రశ్న వస్తుంది. దిక్కులకు మంచి చెడులు దిక్కులకు ఆధిపత్యం
వహిస్తున్న అధిపతులకు గల లక్షణాల పై ఆధారపడి వస్తాయి. అధిపతుల
లక్షణాలనే మనం మంచి చెడు గా వర్గీకరిస్తున్నాము. వాస్తు, జ్యోతిష్యం లోని సంహిత విభాగానికి చెందినది. దిక్కులకు
నవగ్రహాలకు సంభందం ఉంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కున బలాన్ని
కలిగి ఉంటుంది. దిక్కులకు నవగ్రహ బలమే కాకుండా అధిపతి బలంకూడా
ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలే దిక్కులకు
ఉంటాయి. వీటినే మనం మంచి చెడు గా వర్గీకరిస్తున్నాము.
తూర్పుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరతుడు,పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వరుణుడు ఉత్తరానికి
కుబేరుడు ఈశాన్యానికి ఈశ్వరుడు అధిదేవతలుగా ఉన్నారు. వీరిలో దక్షిణానికి
అధిపతియైన యముడు నైరుతి అధిపతి యైన నిరతుడు అధిక చెడునుకలిగిస్తారు. ఇక పడమర అధిపతి వరుణుడు సమయానుకూలంగా చెడును కలిగించగలడు. అనేక రకాలైన పీడనలకు ఇతను కారకుడు. ఇక ఆగ్నేయ దిక్కు తూర్పు వైపు చెడును అదేవిధంగా
దక్షిణనం వైపు మంచిని కలిగిస్తుంది. అదేవిధంగా వాయవ్యం ఉత్తరం వైపు చెడును పడమర వైపు
మంచిని కలిగిస్తుంది. ఇక మిగిలిన దిక్కులు సహజంగా మంచినే కలిగిస్తాయి. అందుకనే తూర్పు ఉత్తరం ఈశాన్యం దిక్కులను
మంచివి అంటాము. మనిషి సుఖ జీవనానికి మంచిని కలిగించే ఈ దిక్కుల
బలాన్ని పెంచి చెడును కలిగించే దిక్కుల బలాన్ని కావలిసినంత మేరకే ఉపయోగించుకోవలసి ఉంటుంది.
ఇది దిక్పతుల వివరణ.
రవి మొదలగు నవగ్రహాలు భూమిపై వాటి ప్రభావాలను తమ కిరణాల ద్వారా చూపిస్తాయి. ఈ విషయాన్ని మన మహర్షులు చాలా
చక్కగా వివరించారు. నవగ్రహాలు ప్రసారం చేసే కిరణాలను మనం కాస్మిక్
రేస్ అని అంటాము. నవగ్రహాలలోకొన్ని శుభ గ్రహాలు మరికొన్నిఅశుభ గ్రహాలు ఉంటాయి.
శుభ గ్రహాల నుండి వచ్చే cosmic rays శుభ ఫలితాలను అశుభ గ్రహాల నుండి వచ్చే కిరణాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క
గ్రహం ఒక్కొక్క దిక్కులో బలం కలిగి ఉంటుంది. శుభ గ్రహాల ఆధిపత్యం
లేదా బలం కలిగిన దిశలు మంచి ఫలితాలను ఇస్తాయి. అశుభ గ్రహాల బలం
కలిగిన దిశలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఇదే అసలు రహస్యం.దిక్కుల మంచి చెడు, దిక్కులకు ఆధిపత్యం వహిస్తున్న గ్రహం
మరియు దిక్పతి పై ఆధారపడి ఉంటుంది. ఇదే వాస్తుకు జోతిష్యానికి
ప్రధాన సంభందం. వాస్తుకు జ్యోతిష్యం తో సంభందం లేదు అన్న వాదన
సరియైనది కాదు. నవగ్రహాలు భూమి పై వివిధ దిక్కుల ద్వారా తమ ఫలితాలను
ప్రసారం చేస్తాయి.గ్రహాలలో శుభులెవరూ అశుభులెవరో
తెలుసుకొంటే దిక్కుల గురించిన పూర్తి అవగాహన వస్తుంది.. ఈ శ్లోకం
గమనించండి
క్షీణేన్దు
మందర విరాహు శిఖక్షమాజా:
పాపాస్తు పాపయుత చంద్ర సతశ్చ్హ పాప:
తేషాను తీవ శుభ దౌ గురు దాస వేశ్యౌ
క్రూరా దివాకర సూతక్షితి ఔ భవేతాం.
పై శ్లోకం ప్రకారం క్షీణ చంద్రుడు, రవి,శని, రాహు,కేతు మరియు పాపులతో కలసిన
బుధుడు అశుభ గ్రహాలు. గురు,శుక్ర, మరియు
శుభులతో కలిసిన బుధుడు, ఇంకా పూర్ణచంద్రుడు శుభ గ్రహాలుగా వర్గీకరించబడ్డాయి.
కొన్ని దిక్కులందు శుభ
గ్రహాలు బలంగాఉంటాయి. కొన్ని దిక్కులందు అశుభ గ్రహాలు బలంగా ఉంటాయి. శుభగ్రహాలు బలంగా
ఉన్న దిక్కులు శుభఫలితాలను, అశుభగ్రహాలు బలంగా ఉన్న దిక్కులు అశుభఫలితాలను
భూమి పైకి ప్రసరింపచేస్తాయి. ఇదే దిక్కులలోని శుభ అశుభ ఫలితాల మర్మం. ఏయే దిక్కులందు
ఏ గ్రహం బలంగా ఉంటుందో ఈ క్రింది శ్లోకం తెలియజేస్తుంది.
ప్రాచ్యామ్ శక్తౌసౌమ్యాజీవాయామ్యాయాం రవి మంగళౌ
మందో బలీప్రతిచ్యాంచ కుబేర్యామ్ చంద్ర భార్గవౌ
ఈ శ్లోకం ప్రకారం బుధుడు, గురుడు తూర్పున బలవంతులు. రవి
కుజులు దక్షిణాన బలవంతులు. శని గ్రహం పశ్చిమంలో బలవంతుడు. ఉత్తరం నందు చంద్ర శుక్రులు
బలవంతులు. వీటిని గ్రహ దిగ్బలములు అంటారు. అదే విధంగా నవగ్రహాలను దిక్కులకు అధిపతులుగా
మన మహర్షులు నిర్ణయించారు. ఈ విధమైన విభజనలో ఏకాశితపదవిన్యాసంలో రాహువు నైరుతి లో, కేతు వు వాయవ్యంలో ఉంటారు. పై వర్గీకరణ ప్రకారం శుభగ్రహాలు తూర్పు ఉత్తర ఈశాన్య
దిక్కులలో బలంగా ఉండుట వలన ఈ దిక్కులు పూజనీయమైనివి గా పరిగణింపబడుచున్నవి. అదే విధంగా
దక్షిణం పడమర నైరుతి మొ| దిక్కులలో పాప గ్రహాలు బలంగా ఉండుటవలన
ఈ దిక్కులుతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు తెలుపుతుంది. ఏ గృహాన్నైనా తూర్పు ఉత్తరాలను, పశ్చిమ దక్షిణాల కన్నా అధిక ఖాళీ ఉంచి నిర్మించాలని వాస్తు ఆదేశిస్తుంది. నవగ్రహ మండలాన్ని మనం గమనించినట్లైతే
ఈ దిక్కులందు శుభగ్రహాల బలం ఉంటుంది.ఈ శ్లోకం గమనించండి....
మధ్యే
వర్తులాకార మండలే రవి:
ఆగ్నేయ
దిగ్భాగే చతురస్రమండలే చంద్ర:
దక్షిణ
దిగ్భాగే త్రికోణాకార మండలే కుజ:
ఈశాన్య
దిగ్భాగే బాణాకార మండలే బుధ:
ఉత్తర
దిగ్భాగే దీర్గ చతురస్రమండలే గురు:
ప్రాగ్
భాగే పంచకోణాకార మండలే శుక్ర:
పశ్చిమ
దిగ్భాగే ధనురాకార మండలే శని:
నైరుతి
దిగ్భాగే సూర్పాకారమండలే రాహు:
వాయవ్య
దిగ్భాగే ధ్వజాకార మండలే కేతు: ---- “సూర్యసిద్ధాంతం”
నవగ్రహ మండలంలో తూర్పు, ఉత్తర ,ఈశాన్యంలో శుభ గ్రహాలైన గురు, బుధ శుక్రులు ఉంటారు. ఈ
గ్రహాలు శుభమైన కిరణాలను లేదా cosmic rays ప్రసారం చేస్తాయి. వీటి వలన గృహస్తుకు శుభఫలితాలు
వస్తాయి. ఈ గ్రహాల శుభదృష్టి మనిషి మనుగడకు, సుఖ జీవనానికి అవసరం.
కనుక ఈ దిక్కులందు అధిక ఖాళీ స్థలం వదిలినట్లైతే అధిక ప్రదేశంలో ఈ గ్రహ దృష్టి పడి
సుఖ శాంతులు కలుగుతాయి.ఈ దిక్కులలో అధిక ఖాళీ
ఉంచి ఇంకా తేలికగా బరువులు వేయకుండా ఉంచితే అధికంగా శుభ గ్రహాల మరియు దిక్పతుల ప్రభావం
పడి గృహస్తుకు అధిక సుఖ శాంతులు లభిస్తాయి. కనుకనే ఈ దిక్కులందు అధిక మైన ఖాళీ స్థలం
వదలమని వాస్తు చేపుతుంది. ఈ గ్రహ దృష్టి కోసమే ఈ దిక్కులను విశాలంగా మరియు పవిత్రంగా
ఉంచాలి.
అశుభ గ్రహాల దృష్టి లేదా cosmic rays వీలైనంత తక్కువగా పడాలి కనుక నవగ్రహామండలంలో పాపగ్రహాల బలం కలిగిన దక్షిణ పశ్చిమ నైరుతి ఆగ్నేయ
వాయవ్య దిక్కులందు తక్కువ స్థలం వదలాలి. ఈ
గ్రహాల కిరణాలకు అవరోధం ఉండాలి. కనుకనే ఈ దిక్కులలో బరువులు వుంచి తక్కువ స్థలం వదిలితే
గృహస్తుకు సమస్యలు రావు. అంటే చెడును ప్రసాదించే దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలి, మంచిని కలిగించే దిశలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలినట్లైతే మనిషి జీవితం శుభ
గ్రహ దృష్టి వలన సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. కనుకనే మంచి దృష్టిని ప్రసాదించే తూర్పు
ఉత్తర ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలం వదలి ప్రతికూల దృష్టిని ప్రసారం చేసే దక్షిణ పశ్చిమ
మొ|లగు దిక్కులలో తక్కువ ఖాళీ స్థలం వదలమని వాస్తు ఆదేశిస్తుంది.
గ్రహం మరియు దిక్పతుల ప్రభావం సరిగా ఉండటానికి ఇంటికి 4 ప్రక్కల
ఖాళీ స్థలాన్ని వదలాలి. హద్దులపై నిర్మాణం ఉండకూడదు. చెడును ప్రసాదించే దిక్కులను కూడా
కావలసినంత మేరకు ఉపయోగించుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సమస్యలు దక్షిణం పడమర దిశల
నుండి ఉంటాయని ఈ దిశలకు ఇంటిని ఖాయం చేసి ఖాళీ వదలకుండా నిర్మించకూడదు. ఈ విధంగా ఇంటిని
నిర్మిస్తే నైసర్గిక వాస్తు దోషం సోకుతుంది. మన మహర్షులు 4 ప్రక్కల ఖాళీ స్థలాన్ని
వదలిన ఇంటికి వాస్తుదోషం ఉండదని చెప్పడం జరిగింది.
చతుర్ద్వారే
గృహేచైవ వాస్తు దొషో న విద్యతే.------ నారద సంహిత.
4 ప్రక్కల స్థలం వదలి
ద్వారాలను అమర్చితే గృహానికి వాస్తు దోషం ఉండదని పై శ్లోకం తెలుపుతోంది. ఇంటికి 4 ప్రక్కల
ద్వారాలను అమర్చితే శుభఫలితాలు వస్తాయి. తూర్పు ద్వారం వలన దైవ భక్తి, ఉత్తర
ద్వారము వలన సిరి సంపదలు దక్షిణ ద్వారం వలన సకల సౌఖ్యాలు, ఇంకా
పశ్చిమ ద్వారం వలన ధనం ధాన్యం వంటి లాభాలు కలుగుతాయని మన మహర్షులు చెప్పడం జరిగింది.
కనుక శుభ ఫలితాలకు గృహానికి 4 ప్రక్కల పిశాచ భాగం వదలి గృహాన్ని నిర్మించుట మంచిది.
No comments:
Post a Comment