గృహం నిర్మించడానికి ప్రధమం గా చేసే పని శంఖుస్థాపన. అంటే దారువుతో చేసిన శంఖువును గృహనిర్మాణ సమయంలో గృహాగర్భానికి ఈశాన్య భాగంలో ప్రతిష్టించాలి. ఈ శంఖువు వలన గృహ వాస్తు ఆయుర్దాయం పెరుగుతుంది. మంచి ప్రతిస్పందనలు ప్రకృతి నుండి లభ్యం అవుతాయి. శంఖువును నిర్దుష్టమైన పద్దతిలో, కొలతలతో తయారుచేయాలి. కొన్ని రకాల దారువులు, అంటే చెక్కలు మాత్రమే సరిపోతాయి. సరియైన నమూనా, మరియు కొలతలు లేకుండా చేసే శంఖువు మంచి ఫలితాలను ఇవ్వకపోగా కొన్ని రకాలైన నష్టాలను ప్రసాదిస్తాయి.
శంఖువు ఏ విధంగా, ఏ కొలతలతో, ఏఏ దారువులతో చేయాలో ప్రజల సౌకర్యార్ధం ఈ క్రింద ఉదహరిస్తున్నాను. ఈ క్రింది విధంగా శంఖువును తయారుచేసి, ప్రతిష్ట చేసి మంచి ప్రయోజనాలను పొందండి..
శంఖువు తయారీకి ప్రశస్తమైన దారువులు, రావి, చండ్ర, మర్రి, ఎర్రచందనం, మరియు గంధపు మ్రాను. పాలకర్ర కూడా మంచిదే. వేప, వెదురు, మారేడు, వంటివి పనికి రావు.
ఈ దారువులకు తొర్రలు ఉండరాదు. లోపల, బయట చేవ కలిగి ఉండాలి. వంకరగా ఉండరాదు.
తగులబడిన, పిడుగులు పడిన చెట్ల నుండి శంఖువు తయారుచేయరాదు. ముళ్ళ చెట్లనుండి శంఖువు తయారు చేయరాదు.
ఇక కొలతలను పరిశీలిద్దాం.......
శంఖువు 6 అంగుళముల మందం, 12 అంగుళముల ఎత్తు ఉండాలి.
శంఖువు పొడవును 3 భాగాలుగా విభజించి క్రింది భాగం 4 పలకలుగా,
మధ్య భాగం 8 పలకలుగా
పై భాగం గుండ్రంగా అంటే మల్లెమొగ్గవలే తయారుచేయాలి.
ఈ విధంగా ఉన్నదానికి తొర్రలు గాని, పుచ్చులు గాని లేకుండా చూడాలి.
ఈ విధంగా ఉన్న శంఖువు మంచి లాభాలను ప్రసాదిస్తుంది..
ఈ విధంగా ఉన్న శంఖువును గృహ గర్భానికి ఈశాన్య భాగంలో ప్రతిష్టించాలి.
ఇటువంటి శంఖువు గృహాలకు మాత్రమే పనికి వస్తుంది.
దేవాలయాలకు వేరే విధమైన నియమాలు ఉంటాయి.
వాటినిగూర్చి తదుపరి తెలుసుకుందాం.
సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం.
H. NO 1-879 సుందరయ్య నగర్
మధిర, ఖమ్మం జిల్లా తెలంగాణా. 507203
venusuryadevara@gmail.com
No comments:
Post a Comment