వాస్తు విజ్ఞానం -1
సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)
“వస నివాసే” అనే ధాతువు నుండి “వాస్తు” అనే పదం జన్మించింది. భూమికి “వాస్తువు” అనే పేరుంది.
భూమి పై నిర్మిస్తున్నాం కాబట్టి వాస్తు అయిందని” మయమతం” చెప్తోంది. నివాస యోగ్యమైన భూమే వాస్తు. వాస్తు శాస్త్రం, గృహాలు, రాజ ప్రాసాదాలు, దేవాలయాలు, తటాకాలు మొదలైన .. వాటి నిర్మాణ నియమాలను, పద్దతులను
తెలియజేస్తుంది. ఈ నియమాలన్ని, ప్రకృతిని మనిషి జీవితానికి సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా
మలుచుకోవాలన్న మూల సూత్రం పై రూపొందింపబడింది. గృహాన్ని శాస్త్రబద్దంగా నిర్మించాలని
వాస్తుశాస్త్రం నిర్దేశిస్తోంది. అసలు గృహాన్ని శాస్త్రబద్దంగా ఎందుకు నిర్మించాలో ఈ క్రింది శ్లోకం తెలియజేస్తోంది...
“స్త్రీ పుత్రాధిక భోగసౌఖ్య జననం ధర్మార్ధ కామప్రదం
జంతునామ్ నిలయం సుఖాస్పదమిదమ్ శీతాంబు ఘర్మపహామ్
వాపి దేవ గృహాది పుణ్యమఖిలం గేహత్శ ముత్పద్యతే
గేహాం పూర్వము శనితేన విబుధాః శ్రీ విశ్వకర్మదయహ”
“----వాస్తు రాజ వల్లభం.”
అనగా భార్యబిడ్డలు, భోగసౌఖ్యాలు, చతుర్విధ పురుషార్ధాలు, పసుపాదుల వృద్దిని కలిగించునది, ఎండ, చలి, వర్షం నుండి రక్షించేది,
దేవాలయాలు, బావులు నిర్మించుట వంటి పుణ్యకర్మలను చేయించేది, సకల పుణ్యాలకు మూలమైన గృహాన్ని శాస్రోక్తంగా నిర్మించాలి అని పై శ్లోకం అర్ధం...
ఇది మహర్షి వాక్కు.
వాస్తుశాస్త్రాన్ని భృగుడు, అత్రి, వశిష్ట, విశ్వకర్మ, మయ , నారద వంటి 18 మంది మహర్షులు మానవ సౌఖ్యం కోసం రచియించారని”
సూతుడు” తెలిపారు. వాస్తు శాస్త్రం పురాతనమైనది.
త్రేతాయుగం నాటి వాల్మీకి రామాయణం లోని సుందరకాండ లోని లంకా నగర వర్ణన లో చాలా
వాస్తు విషయాలను ప్రస్తావించడం జరిగింది. ద్వాపరయుగం నాటి వ్యాస భారతం లో గల మయసభ వర్ణనలో వాస్తు ప్రస్తావన ఉంది. సింధులోయ నాగరికత
లోని ఇండ్ల, వీధుల నిర్మాణం లో వాస్తు ఇమిడిఉందని విజ్ఞుల అభిప్రాయం.
వాస్తు మూఢ నమ్మకం కాదు. మన దేశం లో ఉన్న వాతావరణ
పరిస్థితికి ,సంస్కృతికి అనుగుణంగా వాస్తు రూపొందింపబడింది.
ఆరోగ్య ప్రదమైన, సుఖప్రదమైన జీవితం కోసం వాస్తు ని ఆశ్రయించాలి.
మనదేశం
భూమండలంపై తూర్పుదేశంగా ఉంది. కనుక ఇక్కడ దక్షిణ, నైరుతి గాలులు తూర్పు, ఉత్తరం ఇంకా ఈశాన్యం వైపు వీస్తాయి. అంటే గాలి దక్షిణం,నైరుతి నుండి తూర్పు,ఉత్తరం మరియు ఈశాన్యం వైపుకి వీస్తుంది...
ఇది అందరికీ అనుభవం లోకి వచ్చే విషయమే. ఈ సత్యంపై
ఆధారపడి వాస్తులో చాలా సూత్రాలు రూపొందింపబడ్డాయి. నీరు ఉండాల్సిన ప్రదేశాలు, ఎత్తుపల్లాలు మొదలైన విషయాలన్నీ ఈ గాలి వీచే పద్దతి కి అనుగుణంగానే తెలుపబడినాయి.
బావులు, నీటిగుంటలు, నీటివాడకం ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు
లో ఉండాలని వాస్తు నిర్దేశిస్తోంది. ఈ నియమానికి విరుద్దంగా నైరుతి లోనో లేదా దక్షిణం
లోనో బావులు ఉంటే తీవ్ర నష్టం ఉంటుందని వాస్తు చెప్తోంది. నీరు నిలిచి ఉంటే పాచిపట్టి
సూక్ష్మ జీవులకు నిలయంగా మారుతుంది. ఇటువంటి
నీటి పై గాలి వీస్తూ పయనిస్తే విషంగా మారుతుంది. ఈ గాలి ఇంట్లోకి వస్తే రోగాలు పెరుగుతాయి. అందుకే
నీటి వాడకం ఇంటికి దూరం గా ఉంచమని వాస్తు చెప్తుంది. అందువల్లనే తూర్పు ఉత్తర దిక్కులందు
పడమర, దక్షిణ దిక్కులకంటే
ఎక్కువ ఖాళీ స్థలం వదలాలని వాస్తు ఆదేశిస్తోంది. ఎక్కువ ఖాళీ స్థలం తూర్పు ఉత్తరాలలో వదిలి ,తూర్పు, ఈశాన్య ఇంకా ఉత్తర దిశలలో నీటిని ఉంచితే నీటి
వాడకం ఇంటికి దూరంగా ఉంటుంది. నీటిపై నుండి గాలి ఇంట్లో కి వెళ్లకుండా బయటకు వెళ్ళే
అవకాశం ఉంటుంది. అందుకనే బావులు మొ|| నవి ఈశాన్య ఉత్తర తూర్పు లలో ఉంచాలని వాస్తు చెప్తోంది. నీరు ఈశాన్యం లో ఉంటే
గృహస్తులకు నష్టం ఉండదు ... ఇంటికి దూరంగా నీరు ఉంటుంది...గాలి నీటిపై నుండి గృహం బయటకు
వీస్తుంది.
అదేవిధంగా దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో వర్షం నీరు, వాడుక నీరు నిల్వ ఉండకుండా ఈ దిక్కులను మెరకగా ఉంచాలని వాస్తు నిర్దేశిస్తోంది..
తూర్పు ఉత్తర దిక్కులను పల్లంగా ఉంచాలని వాస్తు చెప్తుంది. ఈ పద్దతిని పాటిస్తే నీరు తూర్పు ఉత్తర దిక్కుల ద్వారా
గృహం బయటకు పోగలదు. తూర్పు ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే నీరు ఇంటికి దూరంగా
వెళుతుంది... అందుకనే ఈ దిక్కులను పల్లం గా ఉంచాలి.
సశేషం.....
సూర్యదేవర వేణుగోపాల్. M.
A. జ్యోతిష్యం
సుందరయ్య నగర్
మధిర ఖమ్మంజిల్లా
Venusuryadevara@gmail.com
No comments:
Post a Comment